మోడీ ప్రధాని అభ్యర్థి కాకూడదని అద్వానీ ఏనాడూ అనలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంపై పార్టీ సీనియర్ నేత అద్వానీ ఇంకా చిర్రుబుర్రులాడుతూనే ఉండటంతో.. ఆయన్ని చల్లబరిచేందుకు అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అద్వానీకి కోప్పడే హక్కుంది గానీ, అంతమాత్రాన పార్టీలో ఈ విషయమై విభేదాలు ఉన్నట్లు కాదని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఒత్తిడితోనే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అద్వానీయే తమ నాయకుడు, కుటుంబపెద్ద అని చెప్పారు. ఆయన కోపాన్ని చల్లార్చేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు.
ఆయన్ను పార్టీలో ఒంటరి చేసే ప్రసక్తి లేదని.. ఆయన మాటే తాము పాటిస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరైనా ఒక పెద్ద తిట్టినంత మాత్రాన కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు కాదన్నారు. మోడీ ప్రధాని అభ్యర్థి కాకూడదని అద్వానీ ఏనాడూ అనలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. జేడీ(యూ) సహా అనేక మంది భాగస్వాములు విడిపోవడంతో.. కొత్త భాగస్వాముల కోసం చూస్తామన్నారు. అయితే, ప్రస్తుతమున్నవారిని కూడా విశ్వాసంలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత మిత్రులు శివసేన, శిరోమణి అకాలీదళ్ అన్నీ మోడీ నియామకాన్ని సమర్థించినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానీ, తర్వాత గానీ కొత్త కూటములు ఏర్పడేప అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.