తుళ్ళూరు: రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలతో ప్రభుత్వం ఏంచేయాలా అన్న ఆలోచనలో పడింది. ఇందులో భాగంగా రైతు నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, జాయింట్‌కలెక్టర్ శ్రీధర్, సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌లు రాజధాని ప్రాంత రైతునాయకులతో సమావేశమై సమస్యలపై సుదీర్ఘంగా చర్చిం చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు పనులు లేవని, కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రైతు దగ్గర భూమి ఉందనీ, ప్రభుత్వం వద్ద పాలసీ ఉందనీ, దీంతో ఇంతవరకు విజయవంతం చేయగలిగామన్నారు. కానీ కూలీల పరిస్థితే అర్థం కావటంలేదన్నారు.
9.3 ద్వారా భూములు తీసుకోవడం, 9.14 ద్వారా భూస్వాధీన ఒప్పందపత్రాలు సిద్ధం చేసి కౌలు పరిహారం ఇవ్వడంతో మా పని అయిపోతుందని భావించవద్దని సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌లనుద్దేశించి అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 10%మాత్రమే పనులు జరిగాయని, ఇంకా 90% చేయాల్సిందన్నారు.అధికారులు సమస్యలను అధ్యాయనం చేసి పరిష్కారం కనుగొనాలన్నారు. పనుల నిర్వహణలో పురోగతిపై సమీక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతు నాయకులు రాజధాని ప్రాంతంలోని ప్రజలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం శ్రావణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఎన్.ఆర్.ఇ.జీ.యస్ ద్వారా పనులు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఉండే ముఠామేస్తీలను కలిసి ఉపాధి పనులపై చర్చిస్తామన్నారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు జాబ్‌కార్డుల మంజూరుకు చర్యలుతీసుకోవాలని అధికారులను కోరారు.
బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి రుణం పొందిన అసైన్డ్ సాగుదారులు రుణమాఫీ కోసం సీఆర్‌డీఏ కార్యాలయంలో స్పెషల్‌గ్రేడ్ ఆఫీసర్ రహంతుల్లాను సంప్రదించాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన భూమిలేని రైతులకు నెలవారీ పింఛన్ రూ.2500 అందచేయాలన్నారు. కార్యక్రమంలో సీఆర్‌డీఏ అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు, ఆర్డీవో తూమాటి భాస్కరనాయుడు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత పాల్గొన్నారు.
కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం
Published Sun, Jul 12 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement