రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో రిక్తహస్తం చూపుతున్నాయి. రబీ సీజన్ ముమ్మరంగా ఉన్నా రుణాలివ్వకుండా రకరకాల సాకులతో రైతన్నలను ఇబ్బంది పెడుతున్నాయి. వేదికలు దొరికితే చాలు పాలకులు తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో అవి అసత్య మాటలని తేలిపోతున్నాయి. కౌలు రైతు కోసం ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన ‘సాగు రైతు రక్షణ హస్త పథకం’ కూడా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో రైతన్న ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అదును దాటుతుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులు తప్ప మరో దిక్కు కనిపించడం లేదు.
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో సుమా రు 4.7 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరే కాకుండా మరో 90 వేల వరకు కౌలు రైతులు ఉన్నారు. రైతుల్ని ఆదుకునేందుకు పంట రుణాలపై వడ్డీ లేని రుణం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నదే తప్ప రైతులకు సక్రమంగా రుణాలు అందించడంలో విఫలమవుతోంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పుకుంటున్నా అది రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. కిరణ్ ప్రభుత్వం గతేడాది సాగు రైతు రక్షణహస్తం పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను (ఎల్‌డీసీ కార్డులు) పంపిణీ చేసింది.
కానీ ఆ పత్రాలు తీసుకుని బ్యాంకులకెళితే రుణం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తగ్గుతున్న దిగుబడులతో రైతులకు పంటపై వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వడ్డీ మాఫీ ఉన్నందున రైతులు బ్యాంకుల రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం రైతులందరికీ రుణాలివ్వడం లేదు. తమ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి, పెద్ద పెద్ద రైతులకు, వ్యాపారస్తులకు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి మాత్రమే పంట రుణాలిస్తూ పేద రైతులు, సామాన్యులను విస్మరిస్తోంది. జిల్లాలో మొత్తం సాగు రైతుల్లో 70 శాతం మంది పేదరైతులే.
వీరికి రుణాలివ్వడంలో బ్యాంకులు వివక్ష చూపుతుండటంతో పంటల సాగుకు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తూ వారికి అధిక మొత్తంలో వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో రూ.2,400 కోట్లు రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా, ఇంత వరకు కేవలం రూ.355 కోట్లు మాత్రమే అందజేశారు. ఖరీఫ్ సీజన్‌లో రూ.680 కోట్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకొని కొంత మేరకు రుణాలు పంపిణీ చేశారు. ఇంకా ఎంతోమంది రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. జిల్లాలో 90 వేల మంది కౌలు రైతులు ఉండగా, ఇంతవరకు 41 వేల మందికి ఎన్‌డీసీ కార్డులు పంపిణీ చేశారు. అందులో కేవలం 3,500 మందికి మాత్రమే రూ.7.36 కోట్లు పంపిణీ చేశారు. గతేడాది 29 వేల మందికి ఎల్‌డీసీ కార్డులు మంజూరు చేయగా, వారిలో 2,500 మందికి రూ.92 కోట్ల 68 లక్షలు ఇచ్చారు.
రీషెడ్యూల్ పేరుతో దగా
ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో పంట నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా పంట వేసేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని పాలకులు చెబుతున్నా.. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కొత్తగా రుణాలు మంజూరు చేసి పాత బకాయిలకు జమ చేసుకుంటున్నారు. దీంతో రైతులకు పెట్టుబడికి పైసా కూడా చేతికందటం లేదు. రీషెడ్యూల్ చేస్తే వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉన్నందున రైతులకు కొంత ఉపశమనం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితి కూడా రైతులకు శాపంగా మారింది.
లక్ష్యాలను పూర్తిచేస్తాం:
రైతులకు వీలైనంత వరకు రుణా లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. గతేడాది లక్ష్యానికి మించే రుణాలిచ్చాం. ఈ ఏడాది కూడా రుణాల పంపిణీ కార్యక్ర మం వేగంగా జరుగుతోంది. కౌలు రైతులకు కూడా రుణాలిస్తున్నాం.
- వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎం
రైతుకు రిక్తహస్తం
Published Mon, Dec 2 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement