దారుణం
అనంతపురం అగ్రికల్చర్ : అప్పులు చెల్లించలేక, కూతురి పెళ్లి చేయలేని నిస్సహాయస్థితిలో కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో వన్నూరప్ప, నారాయణమ్మ అనే రైతు దంపతులు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రైతాంగాన్ని కలవరపరుస్తోంది. వ్యవసాయం ద్వారా నలుగురికీఅన్నం పెట్టి రాజుగా బతకాలని కన్న కలలు ఛిద్రం కావడంతో పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారిపల్లికి చెందిన సుధాకర్ (38) అనే యువరైతు చింతచెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ రెండు సంఘటనలూ ఆదివారం జరిగాయి. జిల్లాలో రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో ఈ సంఘటనలే నిదర్శనం. పంటలు పండక, అప్పులు తీర్చలేక, ప్రభుత్వ సాయం కరువై జిల్లా రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. గడిచిన నెలలో 14 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
జిల్లాలో ఐదేళ్లుగా పంటలు సరిగా పండడం లేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షలాది హెక్టార్లలో ఖరీఫ్, రబీ పంటలు సర్వనాశనం అవుతున్నాయి. ప్రధానంగా వేరుశనగ ప్రతియేటా నష్టాలనే మిగుల్చుతోంది. జిల్లా రైతులకు ఏటా సరాసరి రూ.2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వారికి అండగా నిలవాలనే ఆలోచన అటు రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, ఇటు జిల్లా ప్రజాప్రతినిధులకు గానీ ఉండటం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల వైపు మళ్లుతున్న రైతులకు ధైర్యం చెప్పి.. బతుకుపై భరోసా కల్పించడంలో పాలక యంత్రాంగం విఫలమవుతోంది. దీంతో పురుగుల మందు తాగి, ఉరితాడు బిగించుకుని చనిపోతున్న విషాదకర సంఘటనలు కొనసాగుతున్నాయి. మరికొందరిని గుండెపోటు కబళిస్తోంది. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో అనేక మంది రైతులు కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. అలాగే పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఉన్నత చదువులకు పంపలేక అవస్థ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తుందనే ఆశతో ఆ పార్టీని గెలిపించారు. చంద్రబాబు రుణమాఫీపై ‘తొలి సంతకం’ అంటూ.. తీరా ఎన్నికయ్యాక కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
రుణమాఫీకి పరిమితులు విధించి కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తుండటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీ గందరగోళం నేపథ్యంలో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. రుణమాఫీ ఆశ లేకపోయివుంటే ఎలాగోలా రెన్యూవల్ చేయించుకునేవారు. కొత్త రుణాలు తీసుకుని ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమయ్యేవారు. ఇప్పుడంతా గందరగోళం కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.
చోద్యం చూస్తున్న అధికార గణం
గతేడాది ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తారనుకుంటే.. ఆ ఊసే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ రూపేణా రూ.643 కోట్లు మంజూరు కావాల్సివుంది. అలాగే రూ.85 కోట్లకు పైగా ప్రీమియం కట్టించుకున్న వ్యవసాయ బీమా సంస్థ వాతావరణ బీమా మంజూరులో తాత్సారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని రైతులకు మార్గనిర్దేశం చేసేవారే కరువవ్వడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి.
వరుసగా ఏటా ఒకే పంట (వేరుశనగ) వేస్తూ నష్టపోతున్న రైతులకు.. చిరు ధాన్యాలు సాగు చేసే దిశగా అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. చిరు ధాన్యాల సాగుతో కనీసం పెట్టుబడి అయినా చేతికి వస్తుంది. పైగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు...
కొత్తచెరువు మండలం నిమరకుంటపల్లికి చెందిన కేశప్ప (50) ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు.
పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన పుల్లారెడ్డి (50) పురుగుల మందు తాగి మరణించాడు.
పెద్దవడుగూరు మండలం విరుపాపురానికి చెందిన మహిళా రైతు సరస్వతి (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పామిడి మండలం అనుంపల్లికి చెందిన ఓబన్న (30) ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.
రొద్దం మండలం దొడగట్టకు చెందిన వడ్డే వెంకటేశప్ప (55) ఉరివేసుకుని చనిపోయాడు.
కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో రైతు దంపతులు వన్నూరప్ప, నారాయణమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారిపల్లికి చెందిన రైతు సుధాకర్ (38) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంతకల్లు మండలం వైటి చెరువుకు చెందిన సుధాకర్ (30) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రొద్దం మండలంలో మరో ఇద్దరు, కూడేరు, పుట్టపర్తి మండలాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు రైతుల బలవన్మరణాలు వెలుగులోకి రాలేదు.
గుండెపోటుతో తనువు చాలించిన రైతులు
కుందుర్పి మండలం యనమలదొడ్డికి చెందిన కెంచప్ప (32) గుండెపోటు (మానసిక ఒత్తిడి తట్టుకోలేక)తో మరణించాడు.
నల్లమాడ మండలం మసకవంకపల్లికి చెందిన గంగులప్ప (65) గుండెపోటు (మానసిక ఒత్తిడి తట్టుకోలేక)తో చనిపోయాడు.