సాక్షి, అనంతపురం : ఒక్క సక్కుబాయితోనే కాదు.. చాలామంది రైతుల పట్ల బ్యాంకర్లు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. వరుస పంట నష్టాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలపై ఏమాత్రం కరుణ చూపడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ పాత అప్పులకు జమ చేసుకోకూడదని స్వయాన కలెక్టర్ ఆదేశించినా.. బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.
కలెక్టర్ ఆదేశాలను గుర్తు చేస్తున్న రైతులతో.. ‘ఏం కలెక్టర్ చెబితే వినాలా! ఆయన చెప్పినట్లు వింటే పాత అప్పులు ఎవరు చెల్లిస్తారు? కలెక్టర్ చెప్పేది చెబుతారు.. మేం చేసేది చేస్తామ’ంటూ తెగేసి చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట కోల్పోయిన రైతులకు అంతో ఇంతో ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసిన విషయం విదితమే. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో పంట కోల్పోయిన దాదాపు 6.72 లక్షల మందికి రూ.648 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది.
ఇందులో మొదట విడతగా 39 మండలాల్లోని దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు ఈ ఏడాది జనవరిలోపే పరిహారం ఇచ్చారు. రెండో విడత కింద 24 మండలాల్లోని 2,78,676 మంది రైతులకు ఇటీవల రూ.263.26 కోట్లు విడుదలైంది. ఇన్‌పుట్ సబ్సిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులకు జమ చేయకూడదని ప్రభుత్వం నుంచి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలందాయి. ఇదే విషయాన్ని కలెక్టర్‌తో పాటు పాలకులు సైతం పలు సమావేశాల్లో స్పష్టం చేశారు. అయినా చాలా మంది బ్యాంకర్లు పాత అప్పులకు జమ చేస్తూ రైతులకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే నీ పేరిట పరిహారమే రాలేదని చెబుతున్నారు.
జాబితాలో పేరుందని చెబితే... మంజూరైనట్లు రాయించుకొని రావాలంటూ బెదిరిస్తున్నారు. మరికొన్ని చోట్ల దళారులు రంగప్రవేశం చేసి తమకు అంతో ఇంతో ఇస్తే ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని చెబుతున్నారు. శింగనమల నియోజకవర్గంలోని చిన్న జలాలపురం, బండమీదపల్లి, నరసాపురం గ్రామానికి చెందిన పలువురు దళారుల అవతారమెత్తి రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. పరిహారాన్ని పాత అప్పులకు జమ చేస్తున్నారంటూ తనకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, రాప్తాడు తదితర ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులు ఒప్పుకుంటేనే జమ చేస్తున్నాం
రైతులు ఒప్పుకుంటేనే కొంత మొత్తాన్ని పాత అప్పులకు జమ చేస్తున్నాం. బలవంతంగా ఎవరి నుంచి వసూలు చేయలేదు. ఎవరికైనా ఇబ్బందులుంటే నన్ను నేరుగా కలిసి సమస్య పరిష్కరించుకోవచ్చు.
- ప్రకాశ్‌రావు, ఎస్‌బీఐ మేనేజర్, సలకంచెరువు
పరిహాస(ర)o
Published Mon, Feb 24 2014 2:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement