స్థానిక జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశావాసి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Sun, Sep 8 2013 2:45 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
న్యూస్‌లైన్ :స్థానిక జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశావాసి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. .నందిగాం మండలం తురకలకోట గ్రామం వద్ద శనివారం వేకువజామున 3 గంటల సమయంలో నవరంగ్‌పూర్ నుంచి కటక్ వె ళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కటక్ (యాదపట్నం) కు చెందిన కూడచంద్ర మల్లిక్ (40) అక్కడడిక్కడే మృతిచెందాడు. ఒడిశాకు చెందిన జ్యోతిరంజన్ మహంతి, మహాబంధు అజంత్ కుమార్‌లకు తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు తీవ్ర గుండె నొప్పి వచ్చిందని తోటి ప్రయాణికులు తెలిపారు. బాధితులను హుటాహుటిన పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన జ్యోతిరంజన్, అజంత్ కుమార్‌లను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నందిగాం ఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
ఇచ్ఛాపురం : పట్టణంలోని బోరవీధికి చెందిన అనూష పట్నాయక్ (23) అనే వివాహిత శనివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనూషకు వెంకటరమణతో గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఒక గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్యహత్యకు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి...
పలాస : పలాస అన్నపూర్ణ ఆశ్రమం వీధికి చెందిన నౌగాపు శ్రీనివాసరావు(42) శుక్రవారం రాత్రి కాశీబుగ్గ జగన్నాథసాగరంలో పడి మృతి చెందాడు. కాశీబుగ్గ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్న శ్రీనివాసరావు అతిగా మద్యం సేవించేవాడు. శుక్రవారం సాయంత్రం ఆయన కడుపు నొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పాడు. తిరిగి ఇంటికి రాలేదు. అతని గురించి కుటుంబ సభ్యులు గాలించారు. శనివారం ఉదయం చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఏఎస్‌ఐ ఎస్.తులసీరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతునికి భార్య నౌగాపు తేజమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి...
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస)-దూసి రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు జీఆర్‌పీ హెచ్‌సీ ఎం.చిరంజీవులు తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల వెంగళరావు కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని చెప్పారు. మృతుడి ఒంటిపై ఆకుపచ్చ గళ్ల లుంగీ, తెలుపు రంగుపై ఆకు పచ్చ గీతలు గల పుల్ హాండ్స్ షర్టు ఉన్నాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 94414 68123 నంబరును సంప్రదించాలని తెలిపారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి...
పోలాకి : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్‌ఎఫ్ జవాన్ ప్రియా కోదండరావు శనివారం ఉదయం మృతి చెందాడని హెచ్‌సీ ఎర్రన్నాయుడు తెలిపారు. దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆయన జమ్ము కాశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ జవానుగా పని చేస్తున్నారు. సెలవుపై వచ్చిన ఆయన గత నెల 13న నరసన్నపేట నుంచి దండులక్ష్మీపురం గ్రామానికి వెళుతుండగా పాలవలస గ్రామం వద్ద మోటార్ సైకిల్ పడిపోవడంతో గాయాల పాలయ్యారు. బాధితుడిని విశాఖపట్నం సెవెన్ హిల్స్‌కు తరలించారు. చికిత్స పొం దుతూ మృతి చెందాడని తెలిపారు.
గాయపడిన మహిళ...
రేగిడి : ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి గాయాల పాలై చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. మండలంలోని సరసనాపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ అన్నపూర్ణమ్మ అనారోగ్యానికి గురి కావడంతో శుక్రవారం పొందూరులోని ఆయుర్వేద ఆస్పత్రికి ఆమె అల్లుడు పప్పల వెంకటరావు ద్విచక్రవాహనం తీసుకువెళుతుండగా జారి పడిపోయింది. బాధితురాలు విశాఖపట్నంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని ఎస్సై ఎం.చంద్రమౌళి తెలిపారు. ఆమె మృతితో భర్త నీలంనాయుడు, అల్లుడు పప్పల వెంకటరావు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Advertisement
Advertisement