పుష్కర విషాదం | four died in road accident | Sakshi
Sakshi News home page

పుష్కర విషాదం

Published Tue, Jul 21 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

four died in road accident

రాజమండ్రి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
 జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతి
 పలువురికి తీవ్ర గాయాలు
 శోకసంద్రంలో రెడ్డిపాలెం, శింగరాయి
 
 శృంగవరపుకోట,వేపాడ,ఎల్.కోట,     కె.కోటపాడు : పితృదేవతల్ని తరింప చేయడం కోసం, పుణ్యప్రదమైన గోదావరి పుష్కరస్నానాలు ఆచరించేందుకు రాజమండ్రి వెళ్లి  తీర్థవిధులు పూర్తిచేసి ఆ ఆనందాన్ని, అనుభూతులను గుండెల నిండా నింపుకొని ఇంటికి చేరుతున్న తరుణంలో మృత్యువు దారికాచి వారి సంతోషాలను చిదిమేసింది. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో  విధి వారిని కాటే సింది. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటారన్న తరుణంలో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.    రాజమండ్రి నుంచి వస్తున్న వాహనం విశాఖ జిల్లా  కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం కూడలి వద్ద మంగళవారం వేకువజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, 29 మంది గాయాల పాలయ్యారు.
 
 వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.  బాధితులు, బంధువుల రోదనలతో కె.కోటపాడు ఆస్పత్రి మార్మోగిపోయింది.లక్కవరపుకోట మండలం రెడ్డివానిపాలెంకు చెందిన 29 మంది,  వేపాడ మండలం బానాదికి చెందిన ఇద్దరు, శింగరాయి, వేపాడ గ్రామాలనుంచి ఒక్కొక్కరు మొత్తంగా 33మంది సోమవారం రాత్రి టాటా ఏస్ వ్యాన్‌లో రాజమండ్రి బయలుదేరారు. రాజమండ్రిలో పుష్కరస్నానాలు చేసుకుని తిరిగి ఇంటిముఖం పట్టారు.  వీరు ప్రయాణిస్తున్న వాహనం   మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విశాఖ జిల్లా కె.కోటపాడు మండల పరిధిలో వారాడ సంతపాలెం వద్ద కల్వర్టు వద్దకు వచ్చే సరికి ప్రమాదం జరిగి   సుమారు 20 అడుగుల లోతున్న గెడ్డలో బోల్తాపడింది.
 
  ప్రమాదంలో రెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ(62), వేపాడ మండలం సింగరాయి గ్రామానికి చెందిన కొల్లి సన్యాసమ్మ(58)  సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రెడ్డి సన్యాసమ్మ(60), రెడ్డి అచ్చియ్యమ్మ(63) చనిపోయారు.   కాళ్లు,చేతులు విరిగిపోయిన ఆర్.ఈశ్వరమ్మ, ఎ.రాముడమ్మ, ఆర్.గణేష్, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.రాజేశ్వరి, ఆర్.లక్ష్మణరావు, ఆర్.సింహాచలం, రెడ్డి సింహాచలంనాయుడు, ఆర్. వేములమ్మ, ఆర్. లక్ష్మి, ఆర్.ఈశ్వరరావులకు కె.కోటపాడు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఆర్.భవాని, రెడ్డి సన్యాసమ్మ , ఆర్.చినదేముడు , ఆర్.సన్యాసమ్మ , అనపర్తి కీర్తన, అనపర్తి భరత్ , రెడ్డి కోటి , కొప్పు ముత్యాలరావు, అనపర్తి లక్ష్మి , ఆర్. ఈశ్వరమ్మ , ఆర్.సన్యాసమ్మ , ఎ.లక్ష్మి , ఆర్.అక్కమ్మ , కె.బుచ్చమ్మ , వి.కన్నమ్మ , ఎ.రాముడమ్మ , రెండు సంవత్సరాల వయస్సు గల ఆర్.కోమలి (2) కె.కోటపాడులో వైద్య సేవలు అందిస్తున్నారు.
 
 ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు  బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నెక్కల  నాయుడుబాబులు పరామర్శించారు.. చనిపోయిన రెడ్డి సన్యాసమ్మ, రెడ్డి దేముడమ్మ, కొల్లి సన్యాసమ్మ, రెడ్డి అచ్చియ్యమ్మల దహన సంస్కారాలకు  రూ.8 వేలు చొప్పున ఆయా కుటుంబ సభ్యులకు   కె.కోటపాడు తహశీల్దార్ కె.సత్యారావు అందజేశారు. బాధిత కుటుంబాలను స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్ శ్రీనులు పరామర్శించారు. చోడవరం సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
 
 శోకసంద్రమైన రెడ్డివానిపాలెం
 లక్కవరపుకోట మండలం పోతంపేట పంచాయతీ రెడ్డివానిపాలెం గ్రామంలో ముప్పై కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. రెడ్డి ఇంటిపేరున ఉన్న వీరంతా దాయాదులు, దగ్గర బందువులు. వ్యవసాయం, కూలి పనులు ప్రధాన వృత్తిగా చే సుకుని గడిపే వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో   ప్రతిఇంటి నుంచి ఒకరిద్దరుగా కలిసి పుష్కరస్నానాలకు బయల్దేరారు.  రెడ్డివానిపాలెంకు చెందిన రెడ్డి అచ్చియ్యమ్మ(56) గ్రామంలోని వారితో కలిసి పుష్కరస్నానానికి బయల్దేరింది. ఆమెకు ఎనభైయేళ్ల వయస్సు పైబడ్డ ఆమె తల్లి, 60 యేళ్ల పైబడ్డ భర్త, కొడుకు, కోడలు, కూతురు-అల్లుడు, మనుమలు ఉన్నారు. అంతా యాత్రకు వెళ్లిన అమ్మ వచ్చేస్తుందని పిల్లలు చూస్తుంటే చనిపోయిందన్న పిడుగులాంటి వార్త వారికి చేరింది. దీంతో వారు భోరున విలపిస్తున్నారు.   
 ఇదేగ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ, తనకోడలుతో కలిసి పుష్కరాలకు వెళ్లింది.
 
  ప్రమాదంలో దేముడమ్మ చనిపోగా, కోడలు తీవ్రగాయాలతో విశాఖ కెజీహెచ్‌లో ఉంది.  ఇదే గ్రామానికి చెందిన రెడ్డి సన్యాసమ్మ, గ్రామంలో వారంతా వెళ్తున్నారు. అంతా అయినవాళ్లే కదా వె ళ్లొస్తానంటూ పుష్కరాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు చనిపోవడం, మరో 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలవటం, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో రెడ్డివానిపాలెంలో విషాధచాయలు అలముకున్నాయి.   మంగళవారం ఘటన వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులంతా  ఆస్పత్రికి పరుగులు తీశారు. రెడ్డివానిపాలెం ప్రతి ఇంటా కన్నీటి ధారలు పారుతున్నాయి.  వేపాడ మండలం శింగరాయి గ్రామానికి చెందిన కొల్లు సన్యాసమ్మ(58) రెడ్డివానిపాలెం గ్రామంలో ఉంటున్న తన మేనల్లుడుతో కలిసి పుష్కరాలకు వె ళ్లి ప్రమాదం పాలై ప్రాణాలు వదిలింది. ఈమెను పుష్కరాలకు తీసుకెళ్లిన మేనల్లుడు, అతని భార్యకు ప్రమాదంలో కాళ్లు విరిగాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement