పశ్చిమ గోదావరి / కాళ్ల: రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జక్కరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొగల్తూరు మండలం తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన చేమకూరి బాలాజీ (29) తన బైక్‌పై భీమవరం వైపు నుంచి కలిదిండి వైపు వెళుతున్నారు. అదే సమయంలో భీమవరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా బత్క్‌లి గ్రామానికి చెందిన కె.రాజేష్ (25), కె.గోపీనాథ్ (26), హెచ్.మల్లేష్ (26)లు ఎదురుగా మోటార్ సైకిల్‌పై వస్తున్నారు.
రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. అక్కడికక్కడే బాలాజీ, రాజేష్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని 108లో భీమవరం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో గోపీనాథ్, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేష్ ప్రాణాలు విడిచారు. తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన చేమకూరి బాలాజీకి కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చెరువులు ఉండడంతో శుక్రవారం రాత్రి భీమవరంలోని బంధువుల ఇంటి వద్ద భోజనం చేసి చెరువు వద్దకు బయల్దేరాడు. ముగ్గురు ఒడిశా వాసులు బైక్‌పై కాళ్ల మండలం సీసలి గ్రామం నుంచి అతివేగంగా రావడంతో మోటార్ సైకిళ్లు ఢీకొన్నట్లు పోలీసులు నిర్ధారణ చేశారు.
బాలాజీకి ముగ్గురు అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆడ పిల్లలకు పెళ్లిళ్లు కాగా, బాలాజీకి ఇటీవలే వివాహ సంబంధం కుదిరినట్లు బంధువులు తెలిపారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న బాలాజీ మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తూర్పుతాళ్లు గ్రామస్తులు పెద్దెత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఒడిశా వాసుల మృతి వార్తను సదరు ఫ్యాక్టరీలోని వారి బంధువులకు తెలపడంతో వారు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ప్రమాద సంఘటనా ప్రాంతాన్ని నర్సాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు, సీఐలు నాగరాజు, వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఐలు రాజ్‌కుమార్, రవివర్మ శనివారం ఉదయం పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటు వెళుతున్న వ్యక్తి చెప్పడంతో ప్రమాద విషయాలను తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అతివేగమే ప్రమాదానికి కారణం
రెండు వాహనాలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన ప్రమాదానికి కారణం అతి వేగమేనని తెలుస్తోంది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రోడ్డుపై వెళుతున్న వాహనాలు రెండూ అతివేగంగా ఢీకొనడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గతంలో అదే మలుపులో చాలా ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడమే మరో నలుగురి మృతికి కారణమైందని పలువురు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment