‘వేగం కన్నా ప్రాణం మిన్న.. అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ పోలీసులు నిత్యం చెప్పే సూచనలు ఇవి... అయితే కొందరు వారి సూచనలను పెడచెవిన పెడుతున్నారు... పర్యవసానంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు... ప్రొద్దుటూరు మండలంలో మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు.
ప్రొద్దుటూరు క్రైం : రూరల్ పరిధిలోని ఆర్టీపీపీ రహదారిలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన జానపాటి నాగసుబ్బయ్య (28), వరకాల నారాయణ (21), ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు (42), గిత్తగాండ్ల దానమయ్య (38) మృతి చెందారు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
♦ ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నాగమయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో నాగసుబ్బయ్య రెండో వాడు. చేనేత పని వీరి జీవనాధారం. కుటుంబ సభ్యులందరూ చేనేత పని చేస్తుంటారు. వీరి ఇంటి పక్కనే వరకాల రామకృష్ణ నివాసం ఉన్నాడు. వీరు కూడా చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు నారాయణతోపాటు ఉదయ్ అనే ఇద్దరు కుమారులు, విజయ, విజయదుర్గ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నారాయణ పట్టణంలోని రాణీతిరుమలదేవి కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద చదువులు చదివించి కుమారుడ్ని గొప్ప వాడిగా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక.
ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతనికి భార్య పుల్లమ్మతోపాటు గంగామహేశ్వరి అనే కుమార్తె ఉన్నారు. అతను రోజూ బేల్దారి పని చేయడానికి ప్రొద్దుటూరు వెళ్తాడు. అదే గ్రామంలోని గిత్తగాండ్ల దానమయ్య ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. అతనికి భార్య జ్యోతితోపాటు గ్లోరీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నాగసుబ్బయ్య, నారాయణ ఇళ్లు పక్కనే ఉండటంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇద్దరూ కలసి వెళ్తుంటారు. ఈ క్రమంలో కలమల్లలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్దామని నారాయణ చెప్పడంతో అతనితో కలసి బైక్‌లో నాగసుబ్బయ్య వెళ్లాడు.
బేల్దార్ పనికి వెళ్లిన గంగరాజు మ««ధ్యాహ్నం భోజనం చేయడానికి ప్రొద్దుటూరు నుంచి ఇల్లూరుకు బయల్దేరేందుకు ఆర్టీపీపీ రోడ్డులో నిల్చున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న దానమయ్య పని ముగించుకొని బైక్‌లో గ్రామానికి వెళ్తుండగా.. దారిలో ఉన్న గంగరాజు ఆ బైక్ ఎక్కాడు.
కలమల్లలో పని ముగించుకున్న నారాయణ ఇంటికి పయనమయ్యారు. అయితే ప్రొద్దుటూరు పెన్నా నది సమీపంలోకి రాగానే.. ముందు వైపు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గంగరాజు బైక్‌ను ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో నాగసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆస్పత్రికి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే డిగ్రీ విద్యార్థి నారాయణ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గంగరాజును తిరుపతికి, దానమయ్యను కర్నూలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే దువ్వూరు సమీపంలోకి వెళ్లగానే దానమయ్య, చాపాడు వద్దకు వెళ్లేలోపు గంగరాజు చనిపోయారు.
మిన్నంటిన రోదనలు
జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో నారాయణ తల్లిదండ్రులు, చెల్లెలు విజయ బోరున విలపించారు. ‘గొప్ప వాడివి అవుతావని కలలు కన్నానే’ అని చెప్పుకుంటూ తల్లి లక్ష్మీదేవి రోదించింది.
♦ దానమయ్య, గంగరాజు మృతి చెందంతో ఇల్లూరు గ్రామంలో విషాదం నెలకొంది. భార్య పుల్లమ్మ, కుమార్తె గంగామహేశ్వరి గంగరాజు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. ‘నీవు లేకుండా కుమార్తెను ఎలా పోషించుకోవాలా’ అంటూ భార్య విలపించింది. దానమయ్యకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఊహ తెలియని వయసులో తండ్రి మరణించడంతో చిన్నారిని చూసిన వాళ్లు చలించిపోయారు. ఆయన భార్య జ్యోతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. భర్త మృతదేహం వద్ద రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది.
♦ ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ నాయకుడు బంగారురెడ్డి, ఇల్లూరు నాయకులు దస్తగిరిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment