
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
కృష్ణా: గేర్ రాడ్డు విరిగి పోవడంతో అదుపుతప్పిన స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. 'కేర్ అండ్ షేర్' స్కూల్ బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదవశాత్తు గేర్ రాడ్డు విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు, మరో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గన్నవరం)