
నాలుగు మున్సిపాలిటీల్లో టీడీపీ పాగా
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా మున్సిపాలిటీల ప్రిసైడింగ్ అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించగా...నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. విజయనగరం, సాలూరు మున్సిపాలిటీల్లో పూర్తి మెజార్టీతో పాలకవర్గాలను ఏర్పాటు చేసిన టీడీపీ బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. విజయనగరం మున్సిపల్ చైర్మన్‌గా ప్రసాదుల రామకృష్ణ, వైస్ చైర్మన్‌గా కనకల మురళీమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికకాగా.... వైఎస్ ఆర్ సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు.
సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గొర్లె విజయకుమారి, వైస్ చైర్మన్‌గా తాటి పాండురంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నాయకుని సతీమణి నిమ్మాది శ్యామలకు వైస్ ఛైర్మన్ పదవి కట్టబెటతామని ముందుస్తుగా ప్రకటించినప్పటికీ ఎన్నిక సమయంలో వేరొక వ్యక్తికి కేటాయించడంతో ఆగ్రహించిన ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినా ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. చైర్‌పర్సన్‌గా ద్వారపురెడ్డి శ్రీదేవి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పద విపై పోటీ నెలకొనడంతో టీడీపీ కౌన్సిలర్లంతా వ్యూహాత్మకంగా వాకౌట్ చేయడంతో ఆ ఎన్నిక వాయిదా పడింది. 30 స్థానాలున్న పార్వతీపురం మున్సిపాలిట్టీలో టీడీపీ 14, వైఎస్సార్‌సీపీ 10 చోట్ల గెలుచుకోగా... ఇండిపెండెంట్లు 6 చోట్ల విజయం సాధించారు. ప్రలోభాలకు గురి చేసి, రూ. లక్షలు ఆఫర్ చేసి ఇండిపెండెంట్లును తమవైపు తిప్పుకుని మున్సిపాలిటీని తమ పరం చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. చైపర్సన్‌గా తూముల అచ్యుతవల్లి, వైస్ చైర్మన్‌గా చోడిగంజి రమేష్‌నాయుడు ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని 30 స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 15, టీడీపీ 13, కాంగ్రెస్ 2 చోట్ల విజ యం సాధించాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఓటుతో వైఎస్సార్ సీపీ విజయం సాధించాల్సి ఉంది. కానీ వైఎస్సార్ సీపీకి చెందిన ఒక కౌన్సిలర్ టీడీపీకి మద్దతు తెలపగా, ఇద్దరు ైగె ర్హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికారు. అలాగే టీడీపీ చెర్‌పర్సన్ అభ్యర్థికి మద్దతుగా కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఓటేయడంతో 17 స్థానాలతో బొబ్బిలి మున్సిపాలిటీని ఆ పార్టీ కైవసం చేసుకుంది