అమ్మ, తమ్ముడు చనిపోయారు
బంధువులకు సమాచారమిచ్చిన నాలుగేళ్ల చిన్నారి
సాక్షి, తిరుమల: విధి వక్రించింది. అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం పాలిట విద్యుదాఘాతం శాపంగా పరిణమించింది. ‘‘అమ్మా.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మా, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ నాలుగేళ్ల చిన్నారి రాజా వెక్కివెక్కి ఏడుస్తూ సెల్‌ఫోన్‌లో బంధువులకు చెబుతుంటే తండ్రి వెంకటేష్‌తో పాటు బంధువులకు కన్నీళ్లాగలేదు. భార్య, బిడ్డ మృతదేహాలను చూసిన కుటుంబ పెద్ద వెంకటేష్ కుప్పకూలిపోయాడు.
‘‘అమ్మ.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మ, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ సెల్‌ఫోన్‌లో నాలుగేళ్ల రాజా బంధువులకు చెబుతుంటే ఏడుస్తున్న తండ్రి వెంకటేష్
తమిళనాడుకు చెందిన తల్లి లక్ష్మి(24), ఏడాది బిడ్డ మహేశ్ సోమవారం తిరుమలలో క్యూ లైన్‌లో మరణించడం తెలిసిందే. ఇందుకు విద్యుదాఘాతమే కారణమని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలకు మంగళవారం రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. టీటీడీ అంబులెన్స్‌లో మృతదేహాలను సొంతూరుకు తరలించారు. తక్షణ ఖర్చుల కోసం టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి రూ. 10వేలు ఇచ్చారు.
మృతుల కుటుంబానికి టీటీడీ రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియా
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించాక మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్ నిబంధన కింద రూ. 4 లక్షలతో పాటు టీటీడీ వంతుగా మరో రూ. 4 లక్షలు చెల్లిస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.