ఉలికిపాటు ! | Fourstorey building collapsed | Sakshi
Sakshi News home page

ఉలికిపాటు !

Published Wed, Aug 26 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

ఉలికిపాటు !

ఉలికిపాటు !

- వినుకొండలో కూలిన నాలుగు అంతస్తుల భవనం
- ప్రమాణాలు పాటించకపోవటమే లోపం
- గుంటూరులో 30కు పైగా శిథిలావస్థకు చేరిన భవనాలు
- కూలే దశలో పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్
అరండల్‌పేట (గుంటూరు):
వినుకొండ కుమ్మరిబజారులో పిల్లర్లు లేకుండా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం పాత గుంటూరులో భవనం నిర్మిస్తున్న సమయంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు.  మారుతీనగర్‌లో ఓ ఇంటి నిర్మాణ సమయంలోనే  పూర్తిగా కూలిపోయి ఇద్దరు మృతి చెందారు.

తాజాగా వినుకొండలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పాటు అను భవం లేని ఇంజినీర్లు భవనాలు నిర్మిస్తుండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, గుంటూరులో సాక్షాత్తూ నగరపాలక సంస్థకు చెందిన పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్‌లు కూలే దశలో ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 
శిథిలావస్థకు చేరిన 30 భవనాలు ...

గుంటూరులో శిథిలావస్థకు చేరిన భవనాలు 30కు పైగా ఉన్నాయి. ప్రధానంగా లాలాపేట, గుంటూరువారితోట, పట్నం బజారు, పాతగుంటూరు, మారుతీనగర్, తదితర ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రణాళికాధికారులు  తూతూ మంత్రంగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటితే ఒకసారి అధికారులు వాటిని పరిశీలించాలి. వందేళ్లు దాటిన భవనాలకు మాత్రం నోటీసులు జారీచేసి వాటిని కూల్చివేయాలి. గుంటూరులో ఇటీవల భవన నిర్మాణాలు అధికమయ్యాయి.

ప్రతి నెలా 60కు పైగా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేవలం ప్లాను మంజూరు చేయడంతోనే తమ పనిపూర్తయిందని భావిస్తున్నారు.  ఆ భవన నిర్మాణం ఎలా జరుగుతోంది. ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా,ఇంజినీరు శక్తిసామర్థ్యాలు, బిల్డర్ తీసుకుంటున్న జాగ్రత్తలు, పక్కనే ఉన్న భవనాలకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా.. ప్లానుకు అనుగుణంగా పని జరుగుతుందా లేదా ఇలాంటి అంశాలను సంబంధిత బిల్డింగ్ ఇన్‌స్పెక్టరు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఇవేమీ నగరంలో జరుగుతున్న దాఖలాలు లేవు. ఒక్కోసారి నిర్మాణాలు జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న భవన యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
 
జీఎంసీ భవనాలకూ దిక్కులేదు..
నగరంలో భవనాలను పర్యవేక్షించాల్సిన నగరపాలక సంస్థ తన సొంత భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ ఎదురుగా పీవీకే నాయుడు  మార్కెట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో 44 దుకాణాలు ఉన్నాయి.  శ్లాబ్ మొత్తం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి ప్రజలపై పడుతున్నాయి. కోర్టుసైతం కార్పొ రేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి పదిహేను రోజులకు పైగా అవుతున్నా  కూల్చేందుకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా లాలాపేటలోని పండ్లమార్కెట్ ఇదే పరిస్థితి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
 
చర్యలు తీసుకుంటాం ...
నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలపై చర్యలు తీసుకుంటాం. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం. పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్‌లను వెంటనే కూల్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.   - రవీందర్, ఏసీపీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement