రెప్పపాటులో ఘోరప్రమాదం జరిగిపోయింది. ప్రమాదానికి గురైన వోల్వోబస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు.
కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్: రెప్పపాటులో ఘోరప్రమాదం జరిగిపోయింది. ప్రమాదానికి గురైన వోల్వోబస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర సంఘటన బుధవారం తెల్లవారుజామున 5.10 గంటల ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై కొత్తకోట సమీపంలోని పాలెం వద్ద జరిగింది. కల్వర్టును ఢీకొట్టిన బస్సు డీజిల్‌ట్యాంకు పగలడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకోగా 45 మంది మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు పరుగెత్తుకువచ్చి మంటలను ఆర్పివేసేందుకు విఫలయత్నం చేశారు. వోల్వో బస్సులో ఏసీ ఉండటంతో పాటు ఏసీకి వాడే నియాన్‌గ్యాస్ వల్ల మంటలు త్వరితగతిన వ్యాపించాయి. ప్రయాణికులు బస్సులో నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు కబళించి ప్రాణాలను హరించాయి.
ఘటన జరిగిందిలా..
జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 44 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్లేందుకు బెంగళూర్‌నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో మరో ఆరుగురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో కొత్తకోట మండలంలోని పాలెం దాటిన తరువాత ముందు వెళ్తున్నకారును బస్సు ఓవర్‌టేక్ చేయబోయింది. ఈ క్రమంలో అదుపుతప్పిన బస్సు రోడ్డుకు కుడివైపున బ్రిడ్జిని ఢీకొట్టి కొద్దిదూరంలో ఆగిపోయింది.
ఈ సమయంలో నిప్పురవ్వలు చెలరేగి బస్సు డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే దట్టమైన మంటలు బస్సుకు వ్యాపించాయి. బస్సు ఆగిన వెంటనే డ్రైవర్ ఫిరోజ్‌పాష, క్లీనర్ నియాజ్‌పాషతో పాటు మదర్ పాష, యోగేష్(బెంగళూర్), రాజేష్, శ్రీకర్(హైదరాబాద్), జయసింగ్(ఉత్తరప్రదేష్) స్వల్పగాయాలతో బస్సులో నుంచి కిందికి దూకారు. ఆ వెంటనే మంటలు బస్సు మొత్తానికి అంటుకున్నాయి. అసలు బస్సులో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు తెలుసుకునేలోపే వారంతా మంటల్లో చిక్కుకున్నారు. బస్సులోంచి బయట పడటానికి శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. బస్సుసీట్లలో ఉన్న 45 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి ఆనవాలు లేకుండా కాలిపోయాయి.
అంతా ఆలస్యమే..
ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఆగిఉన్న ఓ కారులో ఉన్న వ్యక్తులు పోలీసులు, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంత పాటు స్థానిక దాబాలో పనిచేసే వంటమనిషి అక్కడికి పరిగెత్తాడు. ఈ లోగా మంటలు పెద్దఎత్తున చేలరేగడం తో అందులో ఉన్న ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. అయితే ఇక్కడికి మంట లను ఆర్పేందుకు వనపర్తి నుంచి ఫైరింజన్ రావడానికి గంటకు పైగా సమయం పట్టిం ది.
ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సుకు మంటలు వ్యాపించినప్పు డే క్యాబిన్‌లో ఉన్న తలుపు తెరుచుకుని ఉం టే మరికొంత మంది ప్రాణాలతో బయటపడేవారు. అయినప్పటికీ ఓ ప్రయాణికుడు మంటల్లో కాలుతూ బస్సులోంచి బయటకు వచ్చి ప్రాణాలు వదిలాడు. అతను తప్ప మిగతావారంతా అగ్నికి ఆహుతైపోయారు. చివరకి ఫైరింజన్ మంటలను ఆర్పేసరికి బస్సులో మాంసపు ముద్దలు మిగిలాయి. కాగా, ఈ ప్రమాదంలో జిల్లాలో జరిగిన మూడో అతిపెద్ద ప్రమాదం. 1971లో పాలెం గ్రామంలో వీధినాటకం చూస్తున్న వారిపైకి బస్సు దూసుకెళ్లడంతో 74మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తాజా బుధవారం జరిగిన ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.