(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : పచ్చి మోసం. కరువు బారిన పడిన రైతన్నకు దన్నుగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచించింది. ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిహారం ఊసే ఎత్తకుండా.. గత ఏడాది పంట నష్టానికి మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించింది. 2013-14లో కరువు దెబ్బకు జిల్లాలో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. వేరుశనగతో పాటు ఇతర పంటలు ఎండిపోయాయి. జిల్లాలో పంటల నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయాధికారులు ఇన్‌పుట్ సబ్సిడీకి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అప్పటి జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
దీంతో నాటి ప్రభుత్వం 6,28,289 మంది రైతులకు రూ.643 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేసింది. సాధారణంగా ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, తక్కిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. అందులోనూ వేరుశనగ పంటకు 68 శాతం నష్టాన్ని కేంద్రం భరిస్తుంది. మన జిల్లాకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు కేంద్రం ఇలాగే నిధులు విడుదల చేస్తుంది. జిల్లాలో ఏటా వేరుశనగ అత్యధికంగా సాగవుతోంది. పంటనష్టపరిహారం నివేదికల్లో కూడా వేరుశనగదే అగ్రస్థానం. ఈ పంటకు వాటిల్లే నష్టం 90 శాతానికిపైగా ఉంటోంది. అంటే కేంద్ర ప్రభుత్వం వాటాగా మన జిల్లాకు 68 శాతం నిధులు ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదలవుతుంటాయి.
ఈ లెక్కన 2013-14లో మన జిల్లా కోసం కేంద్రం దాదాపు రూ.448 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.195 కోట్లు విడుదల చేస్తే 2013-14 ఇన్‌పుట్‌సబ్సిడీని రైతులకు పూర్తిగా చెల్లించొచ్చు. అయితే.. అప్పుడు తాము అధికారంలో లేము కాబట్టి ఇన్‌పుట్‌సబ్సిడీని ఇవ్వలేమని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల కంటే ముందు వ్యవసాయాధికారులకు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బు ఇవ్వకపోయినా.. కనీసం కేంద్రం నుంచి వచ్చిన నిధులైనా జిల్లా రైతులకు విడుదల చేయాలి. ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలకు ఉపక్రమించలేదు. పైగా ఆ నిధులను ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
బీరాలు పలికిన మంత్రులూ మౌనంగానే..
2013 ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ బహిరంగసభలో చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం సభలోనూ ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పలు సందర్భాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ కచ్చితంగా విడుదల చేయిస్తామని, అది మా బాధ్యత అని ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటా పక్కనపెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా విడుదల చేయలేదు. అయినప్పటికీ జిల్లా మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. దీన్నిబట్టే వారికి రైతుల పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి ఉంటో ఇట్టే తెలుస్తోంది.
2014-15 ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరులోనూ మాట తప్పిన చంద్రబాబు
2014-15 ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరులోనూ చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇన్‌పుట్ సబ్సిడీ పెంపుపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అప్పట్లో ఆయన.. ‘ప్రస్తుత ప్రభుత్వం హెక్టారుకు రూ.10 వేల పరిహారం మాత్రమే ఇస్తోంది. మేము అధికారంలోకి వస్తే హెక్టారుకు రూ.25 వేలు ఇస్తామ’ని ప్రకటించారు. కానీ.. ఇప్పుడు హెక్టారుకు రూ.15వేలతోనే సరిపెట్టారు.
పచ్చి మోసం
Published Fri, Apr 24 2015 3:08 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement