ఇంజినీరింగ్ పనుల్లో దండిగా సంపాదించే అవకాశాలెన్నో.. పనికి అంచనాలు వేయడం నుంచి టెండర్ల పని పూర్తయి తుది చెల్లింపుల వరకు రకరకాల పేర్లలో ప్రజల డబ్బు కాజేస్తున్నారు. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజినీరింగ్ శాఖల నుంచి ఏటా రూ.కోట్లలోనే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. ఇక నుంచి కాంట్రాక్టర్ల అక్రమాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. టెండర్లలో కూటమి కట్టకుండా, సిఫార్సులకు పీట వేయకుండా అడ్డగోలు ధరలు వేయకుండా, అస్మదీయులు పని దక్కించుకొనే విధానానికి చెల్లు చీటీ ఇస్తూ టెండర్ విధానంలో సమూల మార్పులు తీసుకురాబోతోంది. సంస్కరణల దిశగా తొలి అడుగు వేసింది. ఈ అడుగు విప్లవాత్మక మార్పు దిశగా పయనిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఒంగోలు సిటీ: జిల్లాలో పలు శాఖల్లో ఏటా రూ.కోట్లలోనే పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల పనులు జిల్లా నుంచి జరుగుతున్నాయి. రోడ్లు భవనాలు, జల వనరులు, పంచాయతీరాజ్, నీటి పారుదల ప్రాజెక్టులు, మురుగు నీటి పారుదల ప్రాజెక్టులు ఇలా ఒకటేంటి సుమారు 74 శాఖల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నాబార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు, కేంద్ర గ్రాంటులు, విదేశీ సంస్థల రుణాల సహకారంతో జరిగే పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటులు, అభివృద్ధి నిధులు, బడ్జెటరీ నిధులతో పనులు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక శాఖలో టెండర్లు జరుగుతూనే ఉంటాయి. ఇంజినీరింగ్ శాఖలు, ఇంజినీరింగ్ పనుల్లోనే రూ.కోట్లలోనే అవినీతి జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవినీతి వ్యవహారాలు, అక్రమాలు, టెండర్లలో అడ్డగోలుతనాన్ని ప్రొత్సహించింది. ఈ అవినీతి విధానం ఇంజినీరింగ్ పనుల్లో వేళ్లూనుకుంది. ఈ వ్యవస్థలో సమూలంగా మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
‘రింగ్’ రాకెట్‌కు చెక్..
టెండర్లలో కూటమి కట్టడం ఇక్కడ బాగా ప్రసిద్ధి. పోటీదారులు టెండర్లలో పాల్గొనకుండా చేస్తారు. ఇందులో అధికారులను ప్రలోభపెడతారు. జిల్లాలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న తంతు ఇదే. ఏటా జిల్లాలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనుల టెండర్ల ద్వారానే సుమారు రూ.2 వేల కోట్లకుపైగా ప్రజల డబ్బులు గుత్తేదారులు, అవినీతికి పాల్పడే అధికారుల జేబులు నింపుతున్నాయి. బినామీల పేరుతో కొందరు అధికారులు ఇక్కడ టెండర్లు వేయడం.. అవకాశం ఉన్న కాడికి దండుకోవడం నిత్యకృత్యం. టెండర్లలో పోటీదారులు వస్తే కూటమి (రింగ్) కట్టడడమే.
ఇక అన్ని స్థాయిల్లో నిఘా..
వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో పనులకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్స్(ఈపీసీ) పద్ధతి ఒకటి కాగా.. రెండో పద్ధతి లంప్సమ్ ఓపెన్ విధానం. ఈపీసీ విధానం ప్రకారం పనులకు కాంట్రాక్టర్ డిజైన్ రూపొందించాలి. పని పూర్తయ్యాక ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అంచనా విలువ కన్నా ఎక్కువ ఖర్చు చేశానని ఆ మేరకు అదనపు బిల్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండదు. కాంట్రాక్టర్ కోట్ చేసిన ధరల ఆధారంగానే వర్గీకరించి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపుతారు. అందరి కన్నా తక్కువ కోట్ చేసిన గుత్తేదారునికి అప్పగించేలా హై పవర్ కమిటీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక టెండర్ల విధానంపై అన్ని స్థాయిల్లోనూ నిఘా ఏర్పడనుంది.
నష్టం వచ్చే ద్వారాలకు మూత..
ఇంజినీరింగ్ పనుల్లో ఎక్కడా నష్టం రాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటి వరకు కాంట్రాక్టు పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలు అడ్డగోలుగా తుంగలో తొక్కారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై టెండర్ల విధానాన్నే అపహాస్యం చేశారు. కొన్ని పనులకు పరిపాలనా అనుమతులు తీసుకోకుండానే పని అంచనా వ్యయాలను భారీగా పెంచేసి టెండర్ల నోటిఫికేషన్లు జారీ చేయించారు. జిల్లాలో వెలుగొండ పనులకు అడ్డగోలుగా అంచనాలు పెంచి ఎస్‌ఆర్ ధరలను పెంచి చంద్రబాబు ప్రభుత్వం వేరే సంస్థకు పనులు కట్టబెట్టడంతో పాత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వెలుగొండ పరిధిలోని కొన్ని ప్యాకేజీల్లో పనులు ముందుకు పోకుండా నిలిచాయి. ఖజానాకు భారీగా నష్టం వచ్చింది. 2017లో హైపవర్ కమిటీని రద్దు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. తమ కాంట్రాక్టు పనులకు కొన్ని నిబంధనలు అడ్డు వస్తున్నాయని రద్దు చేయించారు. ఇక పనుల్లో అడ్డగోలు తనం పెరిగింది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు.
అక్రమాలకు కళ్లెం..
ఇక నుంచి అస్మదీయులకే పని విధానానికి కాలం చెల్లనుంది. కమీషన్లు, అదనపు చెల్లింపులు ఉండవు. ముఖ్యమంత్రి జగన్ తన తొలి సంతకంతోనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. రూ.వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన ఇంజినీరింగ్ పనుల్లో ప్రక్షాళనకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఖజానాపై క్రమేణా భారం తగ్గుతుంది. ఇక టెండర్లలో అడ్డగోలు తనం ఉండదు. టెండర్ల స్థాయిలోనే అన్ని రకాల అక్రమాలకు చెక్ పడనుంది. హైకోర్టు జడ్జి నేతృత్వంలో జుడీషియర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు టెండర్లు పిలుస్తారు.
భారీగా ఆదాయం..
టెండర్ల విధానంలో రానున్న మార్పుల నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. ఇటీవల ఆర్ అండ్ బి నుంచి నిర్వహించిన టెండర్లలోనే తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లను విడిచిపెట్టి అధిక ధరలను కోట్ చేసిన వారికి పని ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఇక జలయజ్ఞం పనుల్లో అయితే పెద్ద ఎత్తున ఖజానా ఆదాయానికి గండి పడింది. జిల్లాలో జరుగుతున్న రూ.వందల కోట్ల పనుల్లో పెద్ద ఎత్తునే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. టెండర్ల విధానంలో రానున్న సమూల మార్పుల నేపథ్యంలో వచ్చే ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పేదల సంక్షేమానికే ఖర్చుచేయనుంది.ఆదా అయ్యే నిధులతో పేదల సంక్షేమానికి వినియోగిస్తారు. ఈ కొత్త వి«ధానం వినూత్న మార్పుకు ప్రగతి అడుగు అన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.
కాంట్రాక్టర్లలో గుబులు..
జిల్లాలో పెద్ద కాంట్రాక్టర్లు 32 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే పనులకు అర్హత ఉన్న కాంట్రాక్టర్లు కేవలం 9 మందే. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే పనులు చేస్తున్నారు. జలవనరులశాఖ, ఆర్‌అండ్‌బీ, ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యం, మానవవనరులు, పరిశ్రమలు ఇతర శాఖల్లో టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. అవినీతి జరిగిన టెండర్లను రద్దు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
అర్హులైతేనే పని..
జిల్లాలో అనర్హులు ఎందరో ఆర్ అండ్ బీ, నీటి పారుదల తదితర ఇంజినీరింగ్ శాఖల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. హాట్ మిక్స్ ప్లాంట్, మినషనరీ ఇతర యంత్రాలు, అర్హతలు అన్ని సరిపోతేనే పని చేసేందుకు కాంట్రాక్టర్‌కు అర్హత ఉంటుంది. జిల్లాలో చేస్తున్న పనులకు పలువురు కాంట్రాక్టర్లకు పనికి సంబంధించి అర్హత లేకున్నా టీడీపీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేశారు. జిల్లాలో కొన్ని రకాల పనులకు సాంకేతిక పరమైన అర్హతలు లేని కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. కొప్పోలు రోడ్డు పనిని కూడా అర్హత లేని కాంట్రాక్టర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment