సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెలతో ప్రైవేట్ మద్యం వ్యాపారం ముగియనుంది. అయితే, మద్యం వ్యాపారులు గత లీజు కాలంలో(2015–17) కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సేవా పన్నును(సర్వీస్ ట్యాక్స్) ఇప్పటికీ చెల్లించలేదు. సెంట్రల్ ఎక్సైజ్ విభాగం గతేడాది నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. సేవా పన్నును మద్యం వ్యాపారులు చెల్లిస్తారా? లేక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా? అన్న అంశాన్ని తేల్చాలని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. 2015–17లో చేసిన వ్యాపారానికి గాను రూ.472 కోట్ల సేవా పన్ను కట్టాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం అప్పటి ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ట్యాక్స్‌ను మద్యం వ్యాపారులే చెల్లిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో అప్పట్లో జీఎస్టీ అధికారులు మద్యం వ్యాపారులకు నోటీసులు పంపించారు. 2015–17 లీజు కాలంలో లైసెన్స్ ఫీజు కింద మద్యం వ్యాపారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,100 కోట్ల చొప్పున వసూలు చేసింది. ఈ లైసెన్స్ ఫీజుపై సేవా పన్నును చెల్లించాలని సెంట్రల్ ఎక్సైజ్ విభాగం తేల్చిచెప్పింది.
నోటీసుల నుంచి రక్షణ పేరిట వసూళ్లు
2015–17 లీజు కాలంలో లైసెన్స్ ఫీజు కింద వసూలు చేసిన రూ.2,100 కోట్లలో 18 శాతం సర్వీస్ ట్యాక్స్‌ను 15 నెలల పాటు చెల్లించాల్సి ఉంది. ఏడాదికి రూ.378 కోట్లు, మరో 3 నెలలకు గాను రూ.94 కోట్లు కలిపి మొత్తం రూ.472 కోట్ల ట్యాక్స్‌ను మద్యం వ్యాపారులు చెల్లించాల్సిందేనని సెంట్రల్ ఎక్సైజ్ విభాగం స్పష్టం చేసింది. అయితే, సేవా పన్నును ఎగ్గొట్టేందుకు అప్పట్లో మద్యం సిండికేట్లు రంగంలోకి దిగాయి. తమకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సేవా పన్ను నోటీసుల వల్ల ఇబ్బందులు రాకుండా చూసేందుకు ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో త్వరలో ప్రైవేట్ మద్యం వ్యాపారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారుల నుంచి సేవా పన్ను వసూలు చేసేందుకు జీఎస్టీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన కాలపరిమితి 15 నెలలు
Comments
Please login to add a commentAdd a comment