ఊరులో ఉపాధి లేదని పనులు వెతుక్కుంటూ భార్యాభర్త వలస వచ్చారు. ఎన్నాళ్లు కష్టపడినా రూ. లక్షలు సంపాదించడం సాధ్యం కాదనుకున్నారు. అమాయకులను మోసం చేసి అనతి కాలంలోనే ధనవంతులు కావాలని కలలు కన్నారు. దేవుడి పేరుతో దందా మొదలు పెట్టారు. మాయమాటలే పెట్టుబడిగా నిరుద్యోగులను టార్గెట్ చేశారు. అనుకున్నట్టే ఏడాదిలోనే దాదాపు వంద మందిని బురిడీ కొట్టించి రూ. 10 లక్షల వరకు వసూలు చేశారు. చివరకు పాపం పండి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వారం రోజుల క్రితం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేíసి మోసానికి పాల్పడిన జంటను మంత్రాలయం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాము కేసు వివరాలను విలేకరులకు వివరించారు.
మంత్రాలయం రూరల్(కర్నూలు): తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం రాజోలి గ్రామానికి చెందిన నాగేంద్రప్ప అలియాస్ మాసాని రాఘవేంద్ర, ఐజ మండలం మాచర్ల గ్రామానికి చెందిన గీత లక్ష్మి అలియాస్ గడిగె లక్ష్మీదేవికి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం బతుకుదెరువు కోసం కోసిగికి వచ్చారు. ఆ తర్వాత శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో సేవ పేరుతో అక్కడికి చేరారు. ఆలయ అధికారులు, వ్యాపారస్తులతో పరిచయం పెంచుకున్నారు. దీని ఆసరాగా చేసుకుని కోసిగిలో కొంత మంది నిరుద్యోగులకు దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 15 వేలు, 20 వేల చొప్పున వసూలు చేశారు. నియామకంలో కొంత జాప్యమవుతుందని, ఉద్యోగం చేయకుండానే కొంత మంది యువకులకు రూ. 5 వేల నుంచి రూ. 8 వేలు వేతనం చెల్లించారు. వారిని నమ్మి కొందరు యువకులు తమ స్నేహితులు, ఇతరుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఇచ్చారు. డబ్బులు తీసుకున్న జంట ఉద్యోగాలు ఇప్పించలేరని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు నిలదీశారు. వారికి రేపు..మాపు అంటూ కాలయాపన చేశారు.
ఈనెల 26వ తేదీన కోసిగి నుంచి మంత్రాలయానికి మకాం మార్చారు. అక్కడ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న బాధితులు ముట్టడించారు. అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జంటను అదుపులోకి తీసుకున్నారు. వారు విచారణలో దాదాపు 100 మంది నుంచి రూ. 10 లక్షలకు పైగా వసూలు చేశారని తెలిసింది. సోమవారం వీరిని అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి రూ. 1,47,900, అలాగే రూ. 2 లక్షలు చేసే బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని సీఐ తెలి పారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు తమను ఆశ్రయించారని, పెద్దకడబూరు, కౌతాళం మండలంలో నిరు ద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment