కర్నూలు(అగ్రికల్చర్): దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు ఎవరి స్థాయిలో వారు అక్రమాలకు తెగబడుతున్నారు. స్వాహాపర్వం వెలుగుచూసిన రోజు ఉన్నతాధికారులు హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనం దాలుస్తుండటంతో వీరి బాగోతం యథేచ్ఛగా సాగిపోతోంది. పింఛన్ల పంపిణీ విషయంలో ఇదే జరిగింది. మూడు నెలల క్రితం వరకు దుర్వినియోగమైన మొత్తం రూ.1.15 కోట్లు కాగా.. ఇప్పుడది రూ.1.44 కోట్లకు చేరుకుంది. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి రూ.50వేలకు పైగా నిధులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రికవరీకి ఆదేశించారు.
బాధ్యులైన పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలన్నారు. ఆ తర్వాత ఆయనా పట్టించుకోకపోవడం.. కింది స్థాయి అధికారులు మౌనం దాల్చడంతో ఈ మూడు నెలల్లోనే రూ.29 లక్షలు కాజేసేందుకు ఆస్కారం ఏర్పడింది. సామాజిక భద్రత పింఛన్లను కొన్ని మండలాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు.. మిగిలిన మండలాల్లో యాక్సిస్ బ్యాంకు, పినో కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్పీలు పంపిణీ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యారు. చనిపోయిన వారి పింఛన్లను కొందరు సీఎస్పీలు ఫోర్జరీ సంతకాలతో కాజేస్తున్నారు.
గ్రామం వదిలి వెళ్లిన వారి పింఛన్లనూ బొక్కేస్తున్నారు. ఈవిధంగా పంచాయతీ సెక్రటరీలు రూ.49.78 లక్షలు.. సీఎస్పీ(కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)లు రూ.94.37 లక్షలు స్వాహా చేసినట్లు మూడు విడతల సామాజిక తనిఖీలో వెల్లడైంది. ఇందులో రూ.18.69 లక్షలు మాత్రమే రికవరీ చేయడం గమనార్హం. సీఎస్పీ పోస్టుల కోసం ప్రతి రోజూ డీఆర్‌డీఏ అధికారులకు పది సిఫారసులు వస్తున్నాయంటే వీటికున్న డిమాండ్ ఇట్టే అర్థమవుతుంది.
బాగా ఆదాయం ఉండటం.. రాష్ట్రంలో పాలన మారిన నేపథ్యంలో ఉన్న వారిని తొలగించి ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు తమ్ముళ్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్.విజయమోహన్ పింఛన్ల వ్యవహారంలో చొరవ చూపితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఇప్పటి వరకు వారిపై ఈగ వాలని పరిస్థితి నెలకొంది. మరి కలెక్టర్ వీరి విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
అవును మేమే తిన్నాం.. ఇప్పుడేంటి!
Published Sun, Aug 24 2014 1:15 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement