c.sudharshan reddy
-
అవును మేమే తిన్నాం.. ఇప్పుడేంటి!
కర్నూలు(అగ్రికల్చర్): దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు ఎవరి స్థాయిలో వారు అక్రమాలకు తెగబడుతున్నారు. స్వాహాపర్వం వెలుగుచూసిన రోజు ఉన్నతాధికారులు హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనం దాలుస్తుండటంతో వీరి బాగోతం యథేచ్ఛగా సాగిపోతోంది. పింఛన్ల పంపిణీ విషయంలో ఇదే జరిగింది. మూడు నెలల క్రితం వరకు దుర్వినియోగమైన మొత్తం రూ.1.15 కోట్లు కాగా.. ఇప్పుడది రూ.1.44 కోట్లకు చేరుకుంది. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి రూ.50వేలకు పైగా నిధులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రికవరీకి ఆదేశించారు. బాధ్యులైన పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలన్నారు. ఆ తర్వాత ఆయనా పట్టించుకోకపోవడం.. కింది స్థాయి అధికారులు మౌనం దాల్చడంతో ఈ మూడు నెలల్లోనే రూ.29 లక్షలు కాజేసేందుకు ఆస్కారం ఏర్పడింది. సామాజిక భద్రత పింఛన్లను కొన్ని మండలాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు.. మిగిలిన మండలాల్లో యాక్సిస్ బ్యాంకు, పినో కంపెనీ ఆధ్వర్యంలో సీఎస్పీలు పంపిణీ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యారు. చనిపోయిన వారి పింఛన్లను కొందరు సీఎస్పీలు ఫోర్జరీ సంతకాలతో కాజేస్తున్నారు. గ్రామం వదిలి వెళ్లిన వారి పింఛన్లనూ బొక్కేస్తున్నారు. ఈవిధంగా పంచాయతీ సెక్రటరీలు రూ.49.78 లక్షలు.. సీఎస్పీ(కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్)లు రూ.94.37 లక్షలు స్వాహా చేసినట్లు మూడు విడతల సామాజిక తనిఖీలో వెల్లడైంది. ఇందులో రూ.18.69 లక్షలు మాత్రమే రికవరీ చేయడం గమనార్హం. సీఎస్పీ పోస్టుల కోసం ప్రతి రోజూ డీఆర్డీఏ అధికారులకు పది సిఫారసులు వస్తున్నాయంటే వీటికున్న డిమాండ్ ఇట్టే అర్థమవుతుంది. బాగా ఆదాయం ఉండటం.. రాష్ట్రంలో పాలన మారిన నేపథ్యంలో ఉన్న వారిని తొలగించి ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు తమ్ముళ్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్.విజయమోహన్ పింఛన్ల వ్యవహారంలో చొరవ చూపితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఇప్పటి వరకు వారిపై ఈగ వాలని పరిస్థితి నెలకొంది. మరి కలెక్టర్ వీరి విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెల 6,8 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలన్నారు. చెక్‌పోస్టులు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది..తదితర వివరాలను అయన అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు అవసరమయ్యే సిబ్బందిని గుర్తించామని చెప్పారు. పోలింగ్ సరళిని చిత్రీకరించేందుకు వీడి యో గ్రాఫర్లు, మైక్రో పరిశీలకులను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు పరిచేందుకు ఏడు రకాల టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కె.రఘురామిరెడ్డి చెప్పారు. సమావేశంలో జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, డీపీఓ శోభా స్వరూపరాణి, కమిషనర్ పీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. -
పకడ్బందీగా బోగస్ ఓట్ల తొలగింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో బోగస్ ఓటర్లను తొలగింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని, ఆ పేర్లను జాబితా నుంచి ఏరివేయాలన్నారు. ఒకే ఇంట్లో 20 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ బోగస్ ఓటర్లేనన్న ఫిర్యాదులు ఉన్నాయని, వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి విచారించాలని, బోగస్ ఓటర్లు ఉంటే ఫారం-7లో నోటీసు ఇచ్చి తొలగించాలని వివరించారు. బాధ్యతను బీఎల్ఓలపై నెట్టకుండా తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ఓటర్ల సవరణ జాబితాను అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లపై నిఘా ఉంచాలని సూచించారు. ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ఎన్నికల కమిషన్ గుర్తించిందని, జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను బీఎల్ఓలు తెరచి ఉంచాలన్నారు. ఈ నెల 23వ తేదీతో ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుందని, ఆ తర్వాత దరఖాస్తులన్నిటిపై జనవరి 4వ తేదీలోగా విచారణ జరపాలన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేసి జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కర్నూలు ఆర్డీఓ కూర్మానాథ్, నంద్యాల ఆర్డీఓ నరసింహులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ వివరాల సేకరణ అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల వివరాలను తహశీల్దార్ల నుంచి తీసుకున్నారు. కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం వివరాలు సేకరించారు. పార్ట్‌టైమ్ వీఆర్వోల వివరాలు తీసుకున్నారు. ఈ వివరాల ఆధారంగానే వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నమోదుకు రేపు ఆఖరు కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఈ ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా(స్పెషల్ క్యాంపైన్ డే) ప్రకటించింది. ఈ రోజున అన్ని పోలింగ్ స్టేషన్లను బీఎల్ఓలు తెరచి ఉంచి ఓటర్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఓటరు నమోదు గడువును ఇప్పటికే పొడిగించారు. ఇకపై ఆ అవకాశం లేనందున ఉన్న రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు నమోదుకు 1.70 లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 1,70,209 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ ద్వారా 87,646, మాన్యువల్‌గా 82,563 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రెండు రోజులు గడువు ఉన్నందున మరో 50 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
మురికివాడల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగర, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని మెప్మా అధికారులను కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో వైద్యశిబిరాల నిర్వహణపై మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 10 మెడికల్ క్యాంపులు మాత్రమే నిర్వహించాల్సి ఉందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కో-ఆర్డినేషన్ చేసుకుని వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కర్నూలు నగరపాలక సంస్థలో 2, నంద్యాల మున్సిపాలిటీలో 2 నిర్వహించాలని తెలిపారు. ఆదోని, బనగానపల్లె, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీల్లో ఒక్కో క్యాంపు మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. నందికొట్కూరు, గూడూరుకు చెందిన మురికివాడల ప్రజలను కర్నూలులో జరిగే మెడికల్ క్యాంపులకు తీసుకురావాలని సూచించారు. మెడికల్ క్యాంపుల్లో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలందరికీ రక్తపరీక్షలు, విటమిన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని తెలిపారు. రక్త, విటమిన్ పరీక్షలను బట్టి వైద్యసేవలు అందించాలని తెలిపారు. జనవరి నెల చివరిలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
జలప్రభపై నిర్లక్ష్యం తగదు : కలెక్టర్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఇందిర జలప్రభ లక్ష్యాల సాధనలో ఏ స్థాయిలో కూడా నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇందిర జలప్రభ ప్రగతిపై డ్వామా ఇతర శాఖల అధికారులతో మంగళవారం కాన్ఫరెన్స్ హాలు కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సక్సెస్ అయిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖకు అంచనాల మేరకు డబ్బులు కట్టినా ఇంత జాప్యం జరిగితే ఎలా అంటూ సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిర జలప్రభ కింద వేసిన బోర్లలో 560 సక్సెస్ అయ్యాయని, ఇందులో 238 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్, పంపుసెట్లు అమర్చామన్నారు. మిగతావాటికి కనెక్షన్ ఎంతకాలానికి ఇస్తారని ప్రశ్నించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పండ్ల తోటలకు డ్రిప్ సౌకర్యం కల్పన, పెండింగ్ భూముల్లో గ్రౌండ్ వాటర్ సర్వే , ఫీజుబులిటీ ఇచ్చిన పాయింట్లలో బోర్లు వేయడం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన పెంచి వాటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డ్వామా అదనపు పీడీ విశ్వనాథరెడ్డి, ఎంఈ నాగసులోచన, ఏపీడీలు లక్ష్మన్న, అబ్దుల్ కలామ్, అరుణకుమారి, అరుణలత, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని, ఆ మేరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. జూలైలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కర్నూలు డివిజన్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విధులు, బాధ్యతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు డీఎల్పీఓ విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలు, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారం తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో రాణించడానికి సర్పంచ్ పదవి తొలిమెట్టు అని దీని ద్వారా నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రోజు పరిచయ కార్యక్రమం మాదిరిగా సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేశామని, విధులు, బాధ్యతలు తదిత రాలపై నవంబర్ నెల 20 నుంచి సంపూర్ణంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పురుషులకు కర్నూలు శివారులోని డీఆర్డీఏ శిక్షణా కేంద్రంలోను, మహిళలకు ఓర్వకల్లు అపార్డు ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని అన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 3 రోజుల పాటు మొత్తం 19 అంశాలపై సమగ్రంగా శిక్షణ ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 13వ ఆర్థిక సంఘం, జెడ్పీ, మండల పరిషత్ నుంచి నిధులు వస్తాయని, వీటికి తోడు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని తెలిపారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 30 శాతం జీతాలు, 15 శాతం పారిశుద్ధ్యం, 15 శాతం వీధిలైట్లు, 20 శాతం దొడ్లు, డ్రెయినేజి, 15 శాతం నీటి సరఫరా, 5 శాతం ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌లకే చెక్ పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నిధులు ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు ఎటువంటి పనులు చేపట్టాలనే దానిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అవసరమైతే పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, డీఎల్పీఓలు సహకారం తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు సామాజిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. జూలై నెలలో 883 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, 443 పంచాయతీలకు మహిళలు, 440 పురుషులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ 1994 పంచాయతీరాజ్ చట్టానికి లోబడి పని చేయాలని వివరించారు. అవగాహన సదస్సులో డీపీఓ శోభ స్వరూపరాణి, ఆర్డీఓ కూర్మానాథ్, డిప్యూటీ సీఈఓ జయరామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డీఎంహెచ్ఓ నరసింహులు, జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ భాస్కరనాయుడు, డీఎల్పీఓ(ఎన్నికలు) మస్తాన్ వలి, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.