కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో బోగస్ ఓటర్లను తొలగింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని, ఆ పేర్లను జాబితా నుంచి ఏరివేయాలన్నారు. ఒకే ఇంట్లో 20 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ బోగస్ ఓటర్లేనన్న ఫిర్యాదులు ఉన్నాయని, వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి విచారించాలని, బోగస్ ఓటర్లు ఉంటే ఫారం-7లో నోటీసు ఇచ్చి తొలగించాలని వివరించారు. బాధ్యతను బీఎల్‌ఓలపై నెట్టకుండా తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ఓటర్ల సవరణ జాబితాను అప్‌లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లపై నిఘా ఉంచాలని సూచించారు.
ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ఎన్నికల కమిషన్ గుర్తించిందని, జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను బీఎల్‌ఓలు తెరచి ఉంచాలన్నారు. ఈ నెల 23వ తేదీతో ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుందని, ఆ తర్వాత దరఖాస్తులన్నిటిపై జనవరి 4వ తేదీలోగా విచారణ జరపాలన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేసి జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ కూర్మానాథ్, నంద్యాల ఆర్‌డీఓ నరసింహులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్వో, వీఆర్‌ఏ వివరాల సేకరణ
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల వివరాలను తహశీల్దార్ల నుంచి తీసుకున్నారు. కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం వివరాలు సేకరించారు. పార్ట్‌టైమ్ వీఆర్వోల వివరాలు తీసుకున్నారు. ఈ వివరాల ఆధారంగానే వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
నమోదుకు రేపు ఆఖరు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఈ ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా(స్పెషల్ క్యాంపైన్ డే) ప్రకటించింది. ఈ రోజున అన్ని పోలింగ్ స్టేషన్లను బీఎల్‌ఓలు తెరచి ఉంచి ఓటర్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఓటరు నమోదు గడువును ఇప్పటికే పొడిగించారు. ఇకపై ఆ అవకాశం లేనందున ఉన్న రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఓటరు నమోదుకు 1.70 లక్షల దరఖాస్తులు
ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 1,70,209 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ ద్వారా 87,646, మాన్యువల్‌గా 82,563 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రెండు రోజులు గడువు ఉన్నందున మరో 50 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పకడ్బందీగా బోగస్ ఓట్ల తొలగింపు
Published Sun, Dec 22 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement