కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని, ఆ మేరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. జూలైలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కర్నూలు డివిజన్‌లో సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విధులు, బాధ్యతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు డీఎల్‌పీఓ విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలు, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారం తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో రాణించడానికి సర్పంచ్ పదవి తొలిమెట్టు అని దీని ద్వారా నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రోజు పరిచయ కార్యక్రమం మాదిరిగా సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేశామని, విధులు, బాధ్యతలు తదిత రాలపై నవంబర్ నెల 20 నుంచి సంపూర్ణంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పురుషులకు కర్నూలు శివారులోని డీఆర్‌డీఏ శిక్షణా కేంద్రంలోను, మహిళలకు ఓర్వకల్లు అపార్డు ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని అన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 3 రోజుల పాటు మొత్తం 19 అంశాలపై సమగ్రంగా శిక్షణ ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
13వ ఆర్థిక సంఘం, జెడ్పీ, మండల పరిషత్ నుంచి నిధులు వస్తాయని, వీటికి తోడు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని తెలిపారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 30 శాతం జీతాలు, 15 శాతం పారిశుద్ధ్యం, 15 శాతం వీధిలైట్లు, 20 శాతం దొడ్లు, డ్రెయినేజి, 15 శాతం నీటి సరఫరా, 5 శాతం ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌లకే చెక్ పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నిధులు ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు ఎటువంటి పనులు చేపట్టాలనే దానిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అవసరమైతే పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు, డీఎల్‌పీఓలు సహకారం తీసుకోవాలని సూచించారు.
సర్పంచ్‌లు సామాజిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. జూలై నెలలో 883 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, 443 పంచాయతీలకు మహిళలు, 440 పురుషులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ 1994 పంచాయతీరాజ్ చట్టానికి లోబడి పని చేయాలని వివరించారు. అవగాహన సదస్సులో డీపీఓ శోభ స్వరూపరాణి, ఆర్‌డీఓ కూర్మానాథ్, డిప్యూటీ సీఈఓ జయరామిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్, డీఎంహెచ్‌ఓ నరసింహులు, జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ భాస్కరనాయుడు, డీఎల్‌పీఓ(ఎన్నికలు) మస్తాన్ వలి, ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు తదితరులు పాల్గొన్నారు.