స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెల 6,8 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలన్నారు.
చెక్‌పోస్టులు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది..తదితర వివరాలను అయన అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు అవసరమయ్యే సిబ్బందిని గుర్తించామని చెప్పారు. పోలింగ్ సరళిని చిత్రీకరించేందుకు వీడి యో గ్రాఫర్లు, మైక్రో పరిశీలకులను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు పరిచేందుకు ఏడు రకాల టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌పీ కె.రఘురామిరెడ్డి చెప్పారు. సమావేశంలో జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, డీపీఓ శోభా స్వరూపరాణి, కమిషనర్ పీవీఎస్ మూర్తి పాల్గొన్నారు.