
ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీలు
నెల్లూరు(విద్య): రాజకీయ పలుకుబడి.. ఆర్థిక బలంతో జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయి. ప్రభుత్వం నేరుగా బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా అధికారపార్టీ నేతల ప్రమేయంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి టీచర్లు అనుకున్న ప్రాంతాలకు నేరుగా బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు సోమవారం బదిలీల ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరాయి.
బదిలీ అయిన వారిలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, 10 మంది ఎస్‌ఏలు , ఒక ఎల్‌పీ, తొమ్మిది మంది ఎస్‌జీటీలున్నారు. మొత్తం 22 మంది టీచర్లు తామనుకున్న పాఠశాలలకు బదిలీలు చేయించుకున్నారు. డీఈఓ కార్యాలయానికి సంబంధం లేకుండానే నేరుగా విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ బదిలీలో ఒకే ప్రాంతానికి ఇద్దరిని బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతమందికి ఖాళీలు లేని పాఠశాలల్లో పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది.
కొన్ని బదిలీల్లో సబ్జెక్టును నమోదు చేయకుండా ఉత్తర్వులు అందాయని సమాచారం. కార్యాలయంతో సంబంధం లేకుండా, ఖాళీలను చూసుకోకుండా నేరుగా ప్రభుత్వ బదిలీల వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. రాజకీయ రంగు విద్యారంగానికి కూడా పులుముకుంది. ఇప్పటికే జిల్లాలో ఏఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో ఖచ్చితంగా తేలని పరిస్థితి. ఈ రాజకీయ బదిలీలవల్ల పూర్తిగా ఆయోమయ పరిస్థితిలోకి విద్యాశాఖ వెళ్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 100 మంది ఇలానే ప్రభుత్వం నేరుగా బదిలీ చేసింది. 9 నెలలు గడవకముందే మళ్లీ ప్రభుత్వ బదిలీలు అన్యాయమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడి రిటైర్‌మెంట్ దగ్గరకొచ్చిన వారికి దక్కాల్సిన స్థానాలు దక్కడంలేదని, డబ్బుతో, రాజకీయ పలుకుబడితో కొందరు నేరుగా బదిలీల ఉత్తర్వులు తెచ్చుకోవడం దారుణమని అర్హులైన ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.
ఈ ఉత్తర్వుల ప్రభావం టెట్, టీఆర్‌టీ (డీఎస్సీ)పై పడనుంది. జిల్లాలో భర్తీ చేయనున్న 416 పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అటు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కొత్త ఉద్యోగాల్లో చేరబోయే వారికి ఈ రాజకీయ బదిలీలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఉపాధ్యాయవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.