ఇసుక చిచ్చు.. పోలీసులకు ఉచ్చు
► ఉచిత ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉదాసీనత
► హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
తాడేపల్లి రూరల్: మండలంలోని ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగిసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై తాడేపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై మంగళగిరి డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆంజనేయ డెవలపర్స్ అధినేత జంగాల సాంబశివరావు (తెలుగుదేశం పార్టీ అనుచరులు), టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు ఆదివారం హోం మంత్రి చినరాజప్ప, ఐజీ సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు ప్రయోజనం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని తాడేపల్లి మండలంలో కొందరు ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి మాట వినకుండా ఎవరైనా వేరేచోట ఇసుక తీసుకుంటుంటే వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తే వారికీ దీనిలో వాటాలు ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు.
పోలీసులదీ..అదే తీరు..!
మండలంలో పోలీసుల పని తీరు కూడా విమర్శలకు ఊతమిస్తోంది. టీడీపీ మండల సమావేశంలో ఎవరికి ఎంతెంత వాటాలు వెళుతున్నాయో బహిరంగంగా చెప్పడంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్‌లలో పోలీసులకు డబ్బులు ఇవ్వాలంటూ లారీకు రూ. 300, ట్రాక్టర్‌కు రూ. 100 చొప్పున వసూలు చేశారు. లారీ డ్రైవర్లు బహిరంగంగానే ‘పోలీసులకంటూ డబ్బులు వసూలు చేస్తున్నార’ని వ్యాఖ్యానించిప్పటికీ ఆ వసూలు రాజాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారు.
ఒక గ్రామానికి చెందిన ట్రాక్టర్లు, లారీలపైనే కేసులు నమోదు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షాత్తూ కొందరు పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. వీరికీ, ఇసుక అక్రమ రవాణా చేసే వారికి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకపోతే శుక్రవారం రాత్రి 18 లారీలు, 10 ట్రాక్టర్లను పట్టుకుని, మూడు ఇసుక లారీలను, రెండు ట్రాక్టర్లను మాత్రమే కోర్టుకు ఎందుకు హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన ఇసుక రీచ్‌ల వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగుసుకునే విధంగా కనిపిస్తోంది.