Home Minister chinarajappa
-
జగన్‌పై హత్యాయత్నం ఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..
చోడవరం/ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌పై దాడి జరిగిన ఘటన బాధ్యత ఏపీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంగీకరించారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోడికత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ కేంద్రానికి అప్పగించే విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటవేసే సమాధానమిచ్చారు. విచారణ కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కోర్టు ఆదేశించినట్టయితే ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తుందా? అని విలేకరులు అడగ్గా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దర్యాప్తు కేంద్రం చేసినా, తాము చేసినా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని..తాము అదే పనిలో ఉన్నామని బదులిచ్చారు. ఘటన ఎయిర్‌పోర్టులో జరిగిందని చెప్పారే తప్ప బాధ్యత మాది కాదని చంద్రబాబు చెప్పలేదని, నిందితుడు ప్రాథమికంగా చెప్పిందే డీజీపీ మాట్లాడారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సిట్ విచారణ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. పోలీస్ కస్టడీలో ఉన్నవారు తమకు ప్రాణహాని ఉందని, ఆరోగ్యం బాగోలేదనే చెబుతారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పడంపై న్యాయవిచారణ జరిపిస్తామని తెలిపారు. -
యూట్యూబ్ వచ్చాక అది సులువైంది: చినరాజప్ప
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. దాచేపల్లి, తమ్మయ్యపేట సంఘటనలు చాల సున్నితమైనవని పేర్కొన్నారు. రౌడీలను, దొంగలను గుర్తించగలం, కానీ, ఇవాళ ఇంట్లో ఉండి మోసగించే పరిస్ధితులు వచ్చాయని, నీతి తగ్గిపోయే పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలని, నైతికత పెరుగాలని అన్నారు. యూట్యూబ్ వచ్చాక సెక్స్ అనే అంశం సులువుగా అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు ఇటువంటి వాటికి ఆకర్షితులై చెడ్డదారి పడుతున్నారని అన్నారు. ఇటువంటి వాటిని నియంత్రించి.. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఉరిశిక్షలు పడే చట్టాలు వచ్చినా జనం జడవడం లేదని పేర్కొన్నారు. శిక్షలు బలంగా ఉన్నాయని కిందవరకు అవగాహన కల్పిస్తేనే మార్పు వస్తుందని తెలిపారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ అయినా లెక్కచేయబోమని, తమకు శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తప్పు చేసినా వ్యక్తి ఎంత గొప్పవాడైనా తీసుకొచ్చి కేసుపెట్టి అరెస్టు చేస్తామన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జాబ్‌మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించేందుకు గ్రామీణ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో బీసీ, ఎస్సీ యువతకు జాబ్‌మేళా నిర్వహించినట్లు ఇప్పుడు కాపు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్రబాబు మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హోంమంత్రి చినరాజప్పకు పరాభవం చినరాజప్ప జాబ్‌మేళాకు హాజరు కాకముందే మంత్రులు ఉమా, రవీంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి వేదికపై ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సమయంలో రాజప్ప రావటంతో ఆయనకు స్వాగతం పలికారు. చినరాజప్ప మాట్లాడగానే మిగిలిన మంత్రులు జెడ్పీ సమావేశం ఉందని వెళ్లిపోయారు. దీంతో వేదికపై చినరాజప్ప అసహనానికి గురైనట్లు కనిపించింది. జాబ్‌మేళాకు తొలిరోజు నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కార్పొరేషన్ డైరెక్టర్ అమరేంద్ర, నోవా కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ముద్రగడను ఎలా డీల్ చేయాలో తెలుసు
హోం మంత్రి చినరాజప్ప సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ పద్మనాభం సంగతి మాకు బాగా తెలుసు.. ఆయన్ను ఎలా డీల్ చేయాలో కూడా మాకు తెలుసునని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన శుక్రవారం మాట్లాడారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపులు ఇచ్చిన తూర్పుగోదావరి బంద్ విఫలమైందన్నారు. పోలీసులు బంద్‌ను విజయవంతం కానివ్వరని, రేపు బంద్‌నూ అలాగే విఫలం చేస్తామని తెలిపారు. టీవీ ప్రసారాలను ఎందుకు అపేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. శాంతిభద్రతల సమస్య రాకుండా కొన్ని చానళ్లను కావాలనే నియంత్రించామని చెప్పారు. ముద్రగడ దీక్ష విరమిస్తే సాక్షి ప్రసారాలు పునరుద్ధరిస్తామని చెప్పారు. ముద్రగడ కోరితే తుని కేసు సీబీఐకి.. సాక్షి, అమరావతి: ముద్రగడ పద్మనాభం కోరితే తుని కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హోమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఈ విషయాన్ని తెలిపారు. -
తల్లిదండ్రుల నుంచే ప్రాణహాని
► రక్షణ కోరుతూ ‘సాక్షి’కి మొరపెట్టుకున్న యువతి ► కొత్తపేట మహిళమండలిలో ఆశ్రయం పొందుతున్న ► బాధితురాలు మాధవి సాక్షి, గుంటూరు : తన తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొలసాని మాధవి శుక్రవారం ‘సాక్షి’కి మొరపెట్టుకుంది. కొత్తపేట మహిళా మండలిలో ఆశ్రయం పొందుతున్న మాధవి కథనం ప్రకారం మైనర్‌గా ఉన్నపుడు 17 ఏళ్ల వయసులో మాధవికి ఇష్టం లేకుండా మేనమామ కొడుకుతో పెళ్లి చేశారు. పెళ్లి ఇష్టం లేక, ఇంటి నుంచి వెళ్లిపోయి చదువుకునేందుకు గుంటూరు వచ్చింది. ఈ విషయంలో తనకు సహకరించిన యువకుడి అమ్మా, నాన్న, అక్కా, బావలపై తన తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనార్టీ తీరడంతో మాధవి విడాకులు కోరుతూ కోర్టు ద్వారా నోటీసులు పంపింది. తన తల్లిదండ్రులకు తుళ్ళూరు, దొండపాడు గ్రామాల్లో 20 ఎకరాల పొలం ఉందని, దానికి తాను అడ్డుగా ఉన్నాననే చంపాలని చూస్తున్నారని మాధవి ఆరోపించింది. ఈ విషయమై ఈనెల 10వ తేదీన గుంటూరు వచ్చిన హోం మంత్రి చినరాజప్పను కలిసి ఫిర్యాదు చేయడంతో, ఆయన రూరల్ ఎస్పీ వద్దకు పంపారని, ఆయన తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటూ ఒత్తిడి చేశారని మాధవి వాపోయింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మాధవి వేడుకుంటోంది. -
ఇసుక చిచ్చు.. పోలీసులకు ఉచ్చు
► ఉచిత ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉదాసీనత ► హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు తాడేపల్లి రూరల్: మండలంలోని ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగిసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై తాడేపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై మంగళగిరి డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆంజనేయ డెవలపర్స్ అధినేత జంగాల సాంబశివరావు (తెలుగుదేశం పార్టీ అనుచరులు), టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు ఆదివారం హోం మంత్రి చినరాజప్ప, ఐజీ సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు ప్రయోజనం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని తాడేపల్లి మండలంలో కొందరు ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి మాట వినకుండా ఎవరైనా వేరేచోట ఇసుక తీసుకుంటుంటే వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తే వారికీ దీనిలో వాటాలు ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. పోలీసులదీ..అదే తీరు..! మండలంలో పోలీసుల పని తీరు కూడా విమర్శలకు ఊతమిస్తోంది. టీడీపీ మండల సమావేశంలో ఎవరికి ఎంతెంత వాటాలు వెళుతున్నాయో బహిరంగంగా చెప్పడంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్‌లలో పోలీసులకు డబ్బులు ఇవ్వాలంటూ లారీకు రూ. 300, ట్రాక్టర్‌కు రూ. 100 చొప్పున వసూలు చేశారు. లారీ డ్రైవర్లు బహిరంగంగానే ‘పోలీసులకంటూ డబ్బులు వసూలు చేస్తున్నార’ని వ్యాఖ్యానించిప్పటికీ ఆ వసూలు రాజాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారు. ఒక గ్రామానికి చెందిన ట్రాక్టర్లు, లారీలపైనే కేసులు నమోదు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షాత్తూ కొందరు పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. వీరికీ, ఇసుక అక్రమ రవాణా చేసే వారికి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకపోతే శుక్రవారం రాత్రి 18 లారీలు, 10 ట్రాక్టర్లను పట్టుకుని, మూడు ఇసుక లారీలను, రెండు ట్రాక్టర్లను మాత్రమే కోర్టుకు ఎందుకు హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన ఇసుక రీచ్‌ల వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగుసుకునే విధంగా కనిపిస్తోంది.