నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జాబ్‌మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించేందుకు గ్రామీణ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో బీసీ, ఎస్సీ యువతకు జాబ్‌మేళా నిర్వహించినట్లు ఇప్పుడు కాపు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్రబాబు మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హోంమంత్రి చినరాజప్పకు పరాభవం
చినరాజప్ప జాబ్‌మేళాకు హాజరు కాకముందే మంత్రులు ఉమా, రవీంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి వేదికపై ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సమయంలో రాజప్ప రావటంతో ఆయనకు స్వాగతం పలికారు. చినరాజప్ప మాట్లాడగానే మిగిలిన మంత్రులు జెడ్పీ సమావేశం ఉందని వెళ్లిపోయారు. దీంతో వేదికపై చినరాజప్ప అసహనానికి గురైనట్లు కనిపించింది. జాబ్‌మేళాకు తొలిరోజు నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కార్పొరేషన్ డైరెక్టర్ అమరేంద్ర, నోవా కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.