పుట్టిన రోజూ పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి..అన్నాడో సినీకవి..నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బర్త్‌డే వేడుకలు జరుపుకున్న తీరును గమనించిన వారెవరికైనా ఈ పాట ఇట్టే స్ఫురిస్తుంది. తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకోసం శుక్రవారం జన్మదినం సందర్భంగా జాబ్ మేళా నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారీమె.. జాబ్‌మేళాకు తరలివస్తున్న యువతను ఈ చిత్రంలో రోజా వెంట చూడవచ్చు.
పుత్తూరు: ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు.. ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులతో శుక్రవారం పుత్తూరు కిక్కిరిసిపోయింది. ఉదయం స్థానిక డిగ్రీ కళాశాలలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందించారు. కేక్ కట్ చేసి ఆమె జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్ కుటుంబంలో పర్యటిస్తుంటే ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. జన్మదినోత్సవం రోజున ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం కంటే ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయిం చుకున్నానన్నారు.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర పట్టణాల్లో కంపెనీల ప్రతినిధులను సంప్రదించి జాబ్‌మేళా నిర్వహణకు కసరత్తు చేసినట్లు వివరించారు. జాబ్‌మేళాకు హాజరై నిరుద్యోగుల నుంచి వివరాల నమోదు ప్రక్రియను ఆమె ప్రారంభిం చారు. నగరి రోడ్డులో కస్తూరి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే రోజా దంపతులను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment