సూత్రప్రాయంగా నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ బ్యూరో: పేదలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందరి అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు రోజుల్లో దీనిపై విధివిధానాలు రూపొందించనుంది. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుకపై వచ్చే ఆదాయం రూ.200 కోట్లే అయినా చెడ్డపేరు ఎక్కువ వస్తోందన్నారు. అందుకే పేదల నిర్మాణ అవసరాలకు ఇసుకను ఉచితంగా ఇస్తామని తెలిపారు. రవాణా చార్జీలు భరిస్తే చాలన్నారు. సోమవారం బిల్డర్లు, ఇతర వర్గాలవారితో దీనిపై సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
ఇసుక అందక సామాన్యుడు బాధపడే పరిస్థితి రాకూడదన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార నదులన్నీ మన రాష్ట్రంలోనే సముద్రంలో కలుస్తాయని, పర్యావరణానికి హాని లేని రీతిలో ఎంతో ఇసుకను ఏటా తవ్వి తీయొచ్చని, అయినా అధికారులు అధిక ఆదాయం సాధించలేకపోయారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నింటిల్లోనూ తనను మెచ్చుకునేవారు ఇసుక విధానం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కాగా ఇసుకను ఎక్కువగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దీనికి చెక్ పెడతామని, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచుతామని చెప్పారు.
ఇసుక విధానంలో డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చాలని, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పుకొచ్చారు. సమావేశానంతరం మంత్రులు పుల్లారావు, నారాయణలు మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే భావనతోనే ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇకపై ఇసుక రీచ్‌ల వేలం, ఆన్‌లైన్ అమ్మకాలు ఉండవన్నారు.
రవాణా చార్జీలు భరిస్తే పేదలకు ఇసుక ఫ్రీ
Published Sat, Feb 27 2016 3:07 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement