సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి వచ్చాక కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయడు దీక్ష అంటూ రాజకీయం చేయాలనుకోవడం సిగ్గు చేటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇసుక మీద రాజకీయం చేస్తూ బతకాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన మీడియా సమావేశంలో ఇసుకపై అనవసర రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మంత్రి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు పొందేలా పాలిస్తుంటే.. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు మాత్రం విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీ హయాంలో ఇసుకను అడ్డుగోలుగా దోచేశారని.. ఇసుక దందా వల్లే చంద్రబాబుని ప్రజలు ఓడించారన్నారు. అయితే తమ ప్రభుత్వం అవినీతి లేని ఇసుక పాలసీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లు వర్షాలు లేవని గుర్తుచేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. నదుల్లో వరదలు రావడంతో ఇసుక సమస్య కొంత ఏర్పడిందన్నారు. అయితే ఇప్పటివరకు లక్షా 24 వేల టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పస్తుతం ఇసుక పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ నెల 14 నుంచి 21 వరుకు జరిగే ఇసుక వారోత్సవాల్లో మరిన్ని స్టాక్ పాయింట్లను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాను కంట్రోల్ చేయడానికి ప్రత్యేక డీజీని నియమించడంతో పాటు 150 నుంచి 200 వరకు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రాత్రి వేళ కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి పరిస్థితుల ఆధారంగా ఇసుక ధరను నిర్ణయిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment