రాజకీయ పాలనే | CM Chandrababu in the collectors meeting: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాజకీయ పాలనే

Published Tue, Aug 6 2024 6:07 AM | Last Updated on Tue, Aug 6 2024 7:23 AM

CM Chandrababu in the collectors meeting: Andhra pradesh

మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా 

కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ రాజధానిలో పేదలకిచి్చన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు! 

ఇంటింటికీ రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ పథకం కూడా రద్దు

ఇసుక రవాణా వ్యయం 5 రెట్లు పెరిగింది 

సచివాలయంలోనే బుకింగ్, రవాణా చార్జీల చెల్లింపు  

గతంలో ఇసుక దోపీడీపై సీఐడీ విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తాం 

డ్రాపౌట్స్‌ను ప్రైవేట్‌ స్కూళ్లలోనూ చేర్చాలి 

రోడ్లు అన్నీ పీపీపీ విధానంలో చేపట్టాలి 

ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అధికారులు వినాలి.. రహదారుల నిర్వహణ, వైద్య సేవలు ఔట్‌ సోర్సింగ్‌కు.. 

అదనంగా జిల్లాకో జాయింట్‌ కలెక్టర్‌

అక్టోబర్‌ 2న ఏపీ విజన్‌ డాక్యుమెంట్‌  

త్వరలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త మద్యం పాలసీ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందు­కనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా తామే పెంచా­మను­కుంటారని చెప్పారు. సచివాలయాల్లోనే ఇసుక బుక్‌ చేసుకుని రవాణా చార్జీలు సైతం చెల్లించవచ్చన్నారు. వినియోగదారుడికి ఇసుక అంది­నట్లు నిర్థారించుకున్నాకే రవాణా ఛార్జీలు ట్రక్కు యజమానికి విడుదలయ్యే పద్ధతి తెస్తామ­న్నారు. ఇసుక తరలించే ట్రక్కులను ప్రీపెయిడ్‌ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్‌ చేస్తామన్నారు.

లారీలు ఇసుక  రీచ్‌ల దగ్గరకు వచ్చి రెండేసి రోజులు ఉండకూడదన్నారు. బడి మానేసిన పిల్ల­లను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్‌ స్కూళ్లలోనూ చేర్పించాలని నిర్దేశించారు. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపట్టాలన్నారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌నకు ఆకాశమే హద్దని, అమరావతిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలి­పారు.

రోడ్ల నిర్వహణను 50 కి.మీ. చొప్పున అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలనూ అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించాలన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రైవేట్‌ రంగంలో వర్చువల్‌ వర్కింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణా­న్ని కొనసాగించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతా­ధి­కారులతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. సమావేశం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగింది. అనంతరం సచివా­లయం గార్డెన్‌లో కలెక్టర్లకు విందు ఏర్పాటు చేశారు. 

ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలు
సహజ వనరులైన ఇసుక, మైనింగ్‌ వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించాలని అంతకుముందు సమావేశంలో సీఎం సూచించారు. ఉచిత ఇసుకపై సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా చార్జీలు పెరగకుండా రీచ్‌లను దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.

ఇసుక రీచ్‌లో ఏం జరిగిందో సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్పాలని, లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత సర్కారు పాలనలో ఇసుక దోపీడీపై సీఐడీతో విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తామన్నారు. వరదను ఒడిసిపట్టి తక్షణమే రిజర్వాయర్లను నింపాలని జలవనరులపై సమీక్షలో ఆదేశించారు. ఎక్కడైనా గేట్లు కొట్టుకు­పోతే ఏఈ, డీఈని డీమ్డ్‌ సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించారు. 

డ్రాప్‌ అవుట్స్‌ సున్నాకు రావాలి
బడికి వెళ్లే పిల్లలకు కిట్స్‌ ఇవ్వడం ఇప్పటికే మూడు నెలలు జాప్యమైందని, వీలైనంత త్వరగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు 
పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. డ్రాప్‌ అవుట్స్‌ సున్నాకు రావాలన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని, అందుకోసం ప్రైవేట్‌లో వర్చువల్‌ వర్కింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 5–10 లక్షల మందికి ఉపాధి 
లభిస్తుందన్నారు. 

రోడ్లు అన్నీ పీపీపీలోనే
రహదారులన్నీ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో చేపట్టాలని, రాష్ట్ర హైవేలన్నీ కూడా పీపీపీలోనే ఉండాలని సీఎం చెప్పారు. పీపీపీలో విధానంలో చేపట్టేందుకు 14 ప్రాజెక్టులను గుర్తించామని అధికారులు పేర్కొనగా ఇంకా పాత మూసలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. టోల్‌ గేట్లు ఏర్పాటు ద్వారా వ్యయం రాబట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు 
సంబంధించి ఒక్క ఫిర్యాదు రాకూడదన్నారు.

వైద్య సేవలు అవుట్‌ సోర్సింగ్‌
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 20 సేవలకు పైగా అవుట్‌ సోర్సింగ్‌కు ఇచ్చామని, ఇప్పుడు కూడా అవుట్‌ సోర్సింగ్‌కు వైద్య సేవలను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను పీపీపీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో పోర్టుల నిర్మాణానికి డబ్బులు, గ్యారెంటీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు తాను వెనక్కు వెళితే చెడ్డపేరు వస్తుందని, అందువల్ల వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

డ్రోన్లతో డ్రైనేజీల పూడికల గుర్తింపు
సోలార్‌ పవర్‌కు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మడకశిర ప్రాంతంలో నాలుగైదు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. దీన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటిపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1,000 నుంచి 2,000 ఫీడర్లలో సోలార్‌ పవర్‌ ద్వారా వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాన్ని తెస్తామన్నారు. గతంలో దోమల నివారణకు డ్రోన్స్‌ వినియోగించామని, ఇప్పుడు డ్రైనేజీల పూడికలు, రహదారుల మరమ్మతులను డ్రోన్స్‌ ద్వారా గుర్తించాలని సీఎం సూచించారు. జిల్లాకో జాయింట్‌ కలెక్టర్‌ను అదనంగా నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు. 

ఉపాధి పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం..
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. పీఎంఏవై–అర్బన్, రూరల్, ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ తదితర పథకాల కింద 9,11,594 గృహాలు పెండింగ్‌లో ఉండగా, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదన్నారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామన్నారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారన్నారు. నీరు – చెట్టు, ఉపాధి హామీ పెండింగు బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. 

సంపద సృష్టించండి.. వంద రోజుల్లో మార్పు
కలెక్టర్లు, అధికారులు వినూత్న ఆలోచనతో సంపద సృష్టించాలని సీఎం సూచించారు. అక్టోబర్‌ 2న రాష్ట్ర విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు విజన్‌ డాక్యుమెంట్లు తయారు చేయాలన్నారు. సెప్టెంబర్‌ 20న ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయ్యేనాటికి మార్పు కనిపించాలని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుందని తెలిపారు. సమర్థులైన అధికారులు గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయారని చెప్పారు. తాను కూడా మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని, గతంలో స్పీడు మళ్లీ చూపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్‌ ఉంటుందని చెప్పారు. తనకు వచ్చిన ఐదు వేల పిటిషన్లలో సగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని చెప్పారు. 

ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష 
గత ప్రభుత్వంలో బటన్‌ నొక్కడం మినహా ప్రజలను పరామర్శించలేదన్నారు. పేదరికాన్ని సున్నాకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చెప్పే అంశాలను కలెక్టర్లు, అధికారులు వినాలని స్పష్టం చేశారు. త్వరలో పరిపాలనకు సంబంధించి ఒక యాప్‌ తెస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసి ఏపీలో 36 మందిని చంపామని ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్‌ఐఆర్‌లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

అడవులంటే పవన్‌కు ఇష్టం.. 
2014–19 మధ్య ఉచితంగా నిర్వహించిన భూసార పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అడవులంటే పవన్‌ కల్యాణ్‌కు చాలా ఇష్టమని, వాటి విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడ­టానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛ భారత్‌ నిధుల యూసీలు ఇవ్వలేదని కేంద్ర అధికారులు తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. 

కొత్త లిక్కర్‌ పాలసీ..
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్‌ గురించి ఆలోచించి కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఏపీలోకి లిక్కర్‌ను అనుమతిస్తామన్నారు. తద్వారా మద్యం అక్రమ రవాణాను అరికడతామన్నారు. కొత్తగా ఇండస్ట్రియల్‌ పాలసీ, ఎంటర్‌ ప్రెన్యూర్‌ పాలసీ, ఎఫ్డీఐ, ఎంఎస్‌ఎంఈ, హార్డ్‌ వేర్‌ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్‌ పాలసీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎనర్జీ, పీపీపీ మోడల్‌లో పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్, వాటర్,  లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్‌ పాలసీలు తెస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. శాంతి భద్రతల నిర్వహ­ణపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల కిందట రూ.వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి కొట్టేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తామన్నారు. 

‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’ అంటూ వాహనాలు తెచ్చి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్‌ పంపిణీకి 15రోజుల పాటు ఇద్దరిని నియమించి వారికి జీతాలు  ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలను మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్‌ దుకాణాలకు రాలేని వారి  ఇంటికి వెళ్లి ఇవ్వాలి.  కాకినాడలో ఒకే ఫ్యామిలీ నుంచి సివిల్‌ సప్లై శాఖకు సంబంధించి మూడు పదవులు నిర్వహిస్తున్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇలాంటి వాటిని నియంత్రించాలి’ అని సీఎం పేర్కొన్నారు.

రాజధానిలో పేదలకిచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు!
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు వాసులకు రాజధాని అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లోని ఆర్‌–5 జోన్‌లో లేఅవుట్లు వేసి సుమారు 50,800 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి, ప్రథమ ప్రాధాన్యం వారికే ఇవ్వాలని పేర్కొన్నారు.

సార్‌.. హామీలు నెరవేర్చండి
సీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా లైవ్‌లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాన్ని సమాచార శాఖ యూట్యూబ్‌ లింక్‌ ద్వారా లైవ్‌ ఇచ్చింది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పలు సమస్యలను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. సీఎం సార్‌.. హామీలు నెరవేర్చండంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ‘వీజీఎన్‌’ అనే పేరుతో కామెంట్‌ చేశారు.

ఎంఎల్‌హెచ్‌పీలకు జీతాలు రాలేదంటూ విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు స్థలాలు, ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరి నాయుడు కోరాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా విద్యా సంస్థలు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని చంద్రధర్‌ అనే వ్యక్తి సూచించాడు. కేజీబీవీ టీచర్ల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ సమస్యలను కొందరు ప్రస్తావించారు.

వ్యవస్థల బలోపేతం
గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది. వ్యవ­స్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీల బలోపేతానికి అందరూ సహకరించాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. పిఠాపురంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాం.     – పవన్‌ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రి

త్వరలో ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్ట సవరణ
ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టాన్ని సవరిస్తాం. గత ప్రభుత్వ పాలనలో 9 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించగా అందులో దాదాపు 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మాకు అందే విజ్ఞప్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి.       – అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి

కలెక్టర్లకు వంద రోజుల ప్రణాళిక
రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్ర­మాలకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్లు సమర్థంగా అమలు చేయాలి. ప్రజా సమస్య­లకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలి.      – నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, సీఎస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement