సీఎం సమీక్షలో శాఖాధిపతుల ముఖస్తుతి
రాజకీయ నేతల్లా గత సర్కారుపై విమర్శలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన కలెక్టర్ల తొలి సమావేశం ఆద్యంతం ముఖస్తుతి.. పరనింద ధోరణిలో సాగింది. పలువురు శాఖాధిపతులు సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఆయా శాఖల పనితీరు, కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే క్రమంలో రాజకీయ నేతలను తలదన్నే రీతిలో గత ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు: మీనా
ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు సూచించారు. గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగాయన్నారు. చివరకు ఈ అక్రమ తవ్వకాల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారని, అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలే ఒక అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు. ఇసుక రవాణా కోసం కొంత ఖర్చు అవుతున్నప్పటికీ అది నామమాత్రమేనన్నారు.స్టాక్ యార్డుల్లో దాదాపు 33 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉందన్నారు.
⇒ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా లేదని, ఉత్పత్తి పడిపోయిందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ చెప్పారు. సహకార బ్యాంకుల్లో పూర్తి స్థాయి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
⇒ అడవుల విస్తీర్ణం పెంపు దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్ కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదన్నారు.
ఆ భూములపై పునఃపరిశీలన చేయాలి: సిసోడియా
శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్రీ హోల్డ్ (యాజమాన్య హక్కులు కల్పించినవి) భూముల రిజిస్ట్రేషన్లు (గిఫ్ట్, సేల్) ఎక్కువగా జరిగాయని, వీటిపై పున:పరిశీలన చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. నిషేధిత జాబితా (22 ఏ) నుంచి అసైన్డ్, చుక్కలు, ఈనాం, షరతులు గల పట్టాల భూములను తొల గించిన తీరును కూడా పరిశీలించాలన్నారు. భూ వివాదాల పరిష్కారం, ఫైళ్ల పరిరక్షణ చాలా ముఖ్యమన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ రికార్డుల దహనం కేసును సిసోడియా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మరో కీలకం పధకం రద్దు!
రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని (రేషన్ డోర్ డెలివరీ) రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందన్నారు. ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన నిలపడంతో ప్రజలు అక్కడికి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన వారు రేషన్ దుకాణానికి వెళ్లలేరా? అనే చర్చ సీఎం సమీక్షలో జరిగింది. ఈ వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొనడంతో ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేసి వాహనాలు, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశంపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయంతీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment