ధనుంజయ్, వెంకటేశ్వర్లు
ప్రకాశం, చీమకుర్తి: ‘‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’’ అని కలిసిమెలిసి తిరిగిన ఇద్దరు ప్రాణ స్నేహితులు 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్న క్షణం ఉద్వేగంతో వారి కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకరు మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ కాగా మరొకరు టైలర్ వృత్తిలో కొనసాగి విరామం తీసుకున్నారు. వీరిద్దరూ సోమవారం చీమకుర్తిలో కలుసుకుని అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ ధనుంజయ్, చీమకుర్తికి చెందిన తాటికొండ వెంకటేశ్వర్లు ప్రాణస్నేహితులు. వెంకటేశ్వర్లు టైలరింగ్ పని నేర్చుకోవడానికి 1970లో నాసిక్ వెళ్లారు. ధనుంజయ్ తండ్రి వద్ద టైలరింగ్ వర్క్ నేర్చుకున్నారు.
ఆలింగనం చేసుకుంటున్న స్నేహితులు
ఆ సమయంలో ధనుంజయ్‌కు ప్రాణమిత్రుడిగా ఉండేవారు. కాలక్రమంలో ధనుంజయ్ మిలిటరీలో స్థిరపడగా, వెంకటేశ్వర్లు చీమకుర్తిలో బాంబే టైలర్‌గా గుర్తింపు పొంది టైలరింగ్‌లో స్థిరపడ్డారు. తర్వాత ఆయన టైలరింగ్ నుంచి విరమించుకుని రాజకీయ నాయకుల అనుచరుడిగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ధనుంజయ్ కుమారుడు సూరజ్ ధనుంజయ్ గనోర్ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారుడిని చూసేందుకు ఒంగోలు వచ్చిన ధనుంజయ్ 50 ఏళ్ల క్రితం నాటి స్నేహం గురించి కుమారుడికి చెప్పారు. దీంతో ట్రైనీ ఐఏఎస్ సూరజ్ ధనుంజయ్ తన సిబ్బందితో కలిసి చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఆరా తీసి తాటికొండ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు. సోమవారం ఇద్దరు మిత్రులు కలిశారు. వారి స్నేహానికి గుర్తుగా చీమకుర్తిలోని ఎస్‌కేఆర్ మానసిక వికాస కేంద్రంలో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇద్దరు స్నేహితులను కలపడంలో చీమకుర్తికి చెందిన గుండా శ్రీనివాసరావు, పరాంకుశం శ్రీనివాసమూర్తి సహకారం అందించి మధురానుభూతి పొందారు. ఇద్దరు మిత్రుల స్నేహబంధాన్ని పలువురు స్థానికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment