కైలాసగిరిపై సాంస్కృతిక నికేతనం ప్రారంభం
మరింత అభివృద్ధికి సీఎం హామీ
విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, ప్రచారం కోసం విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన తెలుగు సాంస్కృతిక నికేతనం (మ్యూజియం)ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య, వుడా సంయుక్తంగా, పలువురు దాతల సహకారంతో రూ.12.75 కోట్ల వ్యయంతో నిర్మించినా ఈ మ్యూజియాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడుతో కలిసి సీఎం సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని దృశ్య, శ్రవణ సాంస్కృతిక నికేతాన్ని విశాఖలో నిర్మించడానికి ముందుకు వచ్చిన ప్రపంచ తెలుగు సమాఖ్యను సీఎం అభినందించారు. రాష్ర్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలను నికేతనం అభివృద్ధికి అందిస్తామని హామీ ఇచ్చారు. కైలాసం ఎలా ఉంటుందో చూడకపోయినా కైలాసగిరి ఆ లోటును తీరుస్తోందని, అలాంటి ప్రదేశంలో మ్యూజియం ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. మ్యూజి యం పరిరక్షణకు ప్రభుత్వ పరంగా గవర్నింగ్ బాడీని ఏర్పా టు చేస్తామని, మ్యూజియం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి సహకరిస్తామని సీఎం ప్రకటించారు.
అమరావతిలో కూడా నిర్మిస్తాం
ఈ మ్యూజియంలో కళాకేంద్రాన్ని, వసతిగృహాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని సమాఖ్య అధ్యక్షురాలు వి.ఎస్.ఇందిరా దత్ తెలిపారు. విశాఖలో ఇచ్చినట్లుగానే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఐదెకరాల స్థలం కేటాయిస్తే అక్కడ కూడా ఇటువంటి మ్యూజియం నిర్మిస్తామని సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
విశాఖలో రవీంద్రభారతిని మించిన ఆడిటోరియం
నగరంలోని ఎంవీపీ కాలనీలో రూ.30 కోట్లతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని మించిన సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మిస్తామని రాష్ట్ర విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నికేతనం నిర్మాణంలో పాలు పంచుకున్న కళాదర్శకుడు తోట తరణి, వాయిస్ ఓవర్ అందించిన సినీ నటుడు సాయికుమార్, నేపధ్యగానం చేసిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం సమకూర్చిన వందేమాతరం శ్రీనివాస్, విరాళాలు ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐలు, స్థానికులను ఈ సందర్భంగా సీఎం, మంత్రులు అభినందించారు. తెలుగు సాంస్కృతిక నికేతనం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రపంచ తెలుగు సమాఖ్య ధర్మకర్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పార్లమెంట్ సభ్యులు కంబంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పప్పల చలపతిరావు, ప్రపంచ తెలుగు సమాఖ్య సెక్రటరీ జనరల్ సాయికుమార్ శ్రీనివాస్, కళాఖండాల రూపశిల్పి తోట తరణి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలుగు సాంస్కృతిక వారసత్వం
తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేదిగా ఈ మ్యూజియం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి కూడా సహకారం అందిస్తామన్నారు. మ్యూజియంలో చారిత్రక, సాంస్కృతిక ఘట్టాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వివరించే ఏర్పాటు ప్రస్తుతం ఉండగా ఇతర భాషల్లో కూడా వినిపించాలని నిర్వాహకులకు సూచించారు.
సంస్కృతికి అద్దం
Published Thu, Nov 19 2015 11:06 PM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM
Advertisement
Advertisement