
నేటి నుంచి పాఠశాలలు
- 32 మండలాల్లో 799 స్కూళ్లు ధ్వంసం
- రూ.23.5 కోట్ల నష్టం
సాక్షి, విశాఖపట్నం : వారం రోజుల తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. సోమవారం నుంచి తరగతులు నిర్వహించడానికి విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 4174 పాఠశాలలు ఉండగా తుపాను కారణంగా మైదాన ప్రాంతాల్లో 32 మండలాల్లో 799 స్కూళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో అయిదు పూర్తిగా పాడయ్యాయి. వీటిని పునర్నిర్మించేందుకు రూ.23.50 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటికే ఏజెన్సీలో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగు పడకపోవడంతో అక్కడ 11 మండలాల్లో ఎన్ని పాఠశాలలు దెబ్బతిన్నాయన్న విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం సోమవారం నుంచి తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా పాడైన 5 పాఠశాలల విద్యార్థులను ఇతర స్కూళ్లలో తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా రేకులు షెడ్డులు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాంబిల్లి మండలం లాలం కోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అక్కడే ఉన్న ఎంపీయూపీ స్కూల్‌లో తరగతులు నిర్వహిస్తారు. అలాగే యలమంచిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదే ప్రాంతంలో ఉన్న జెడ్పీ హైస్కూల్‌లోను, కశింకోట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎదురుగా ఉన్న ఎంపీయూపీ పాఠశాలలోను, రైల్వే న్యూకాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డాబాగార్డెన్స్‌లో ఉన్న ఎంజీఎం హైస్కూల్‌లోను, రాంబిల్లి మండలం ధిమిలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అక్కడే ఉన్న ఎంపీయూపీ స్కూల్‌లో తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఆయా పాఠశాలల్లో తాగునీరు, మధ్యాహ్నభోజన ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ కృష్ణారెడ్డి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదులు సక్రమంగా లేవని అనుమానం వస్తే అవసరమైతే పిల్లలను ఇళ్లకు పంపించాలని ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.