కదం తొక్కిన మహిళలు | Full debt waiver | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన మహిళలు

Published Sat, Aug 9 2014 12:07 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

కదం తొక్కిన మహిళలు - Sakshi

కదం తొక్కిన మహిళలు

  •      సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
  •      సీఎం చంద్రబాబు తమనుమోసగించారని ధ్వజం
  •      వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇల్లు ముట్టడి
  •      దువ్వలో ఎంపీపీ అనంతలక్ష్మి ఘెరావ్
  • ఇరగవరం/తణుకు రూరల్ : రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళలు కదం తొక్కారు. పూటకో మాట చెబుతున్న సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలను తక్షణమే పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని ముట్టడించారు. రేలంగి నుంచి పాదయూత్రగా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చేరుకున్నారు.

    వేల్పూరులో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తక్షణమే రుణాల్ని మాఫీ చేయూలని, ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో మాఫీని వర్తింపచేయూలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని, ఒక్క పైసా కూడా చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి రుణమాఫీని రూ.లక్షకు కుదిస్తామనడం సరికాదని, దీనిపై స్పష్టత ఇవ్వకుండా కాలయూపన చేస్తున్న ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

    చంద్రబాబు మహిళల్ని నమ్మించి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ విషయంపై స్పష్టత ఇచ్చేంతవరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. మండుతున్న ఎండలో సుమారు గంటన్నరపాటు మహిళలంతా ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించారు. ఒక దశలో మహిళలు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, తణుకు రూరల్ ఎస్సై కె.గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు.

    తణుకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వల్లూరి వెంకటరామ్మోహన్, రేలంగి గ్రామానికి చెందిన ఇరగవరం మండల జెడ్పీటీసీ సభ్యుడు చుక్కా సాయిబాబు, టీడీపీ నాయకుడు బిరదా వీరబాపన్న మహిళలతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే అందుబాటులో లేరని, ఆదివారం రేలంగి గ్రామానికి నేరుగా వచ్చి డ్వాక్రా మహిళల్ని కలుస్తారని సర్దిచెప్పడంతో వెనుతిరిగారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
     
    మోసగించడం దారుణం

    రుణమాఫీ అంటూ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నో ఆశలు చూపించి చివరకు మోసం చేయడం దారుణం. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిచాక మాట దాట వేస్తున్నారు.
     -ఎ.రత్నమాల, రత్న గ్రూప్
     
    అప్పులు ఎలా తీర్చేది
    రుణమాఫీ ఆశ పెట్టకపోతే బ్యాంకోళ్లకు సక్రమంగా డబ్బు చెల్లించేవాళ్లం. పూర్తి  రుణమాఫీ అనడంతో డబ్బు కట్టడం మానేశాం. ఇప్పుడు పూర్తిగా రుణమాఫీ చేయకపోతే పేరుకుపోయిన అప్పుల్ని ఎలా తీర్చేది. తక్షణమే పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి.
     -దిర్శిపో అచ్చమ్మ, కరుణ గ్రూప్
     
    హామీలు గుర్తు లేవా
    ఎన్నికల్లో మాట ఇవ్వబట్టే కదా నమ్మి ఓట్లు వేశాం. ఇంటింటికీ వచ్చి మీరు ఇచ్చిన హామీలు గుర్తు లేవా. వెంటనే ఇచ్చిన హామీ అమలు చేయండి. పేరుకుపోయిన రుణాలు చెల్లించాలంటే మా కుంటుంబాలపై తీవ్ర భారం పడుతుంది. ఆర్థికంగా నష్టపోతున్నాం.
     - పాములపర్తి వరలక్ష్మి, గ్రేసమ్మ గ్రూప్
     
    మాట నిలబెట్టు కోవాలి
    వడ్డీతో కలిపి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఒక్కొ క్క సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామంటున్నారు. ఆ డబ్బు వడ్డీకైనా సరిపోతుందా. రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసి మాట నిలబెట్టుకోవాలి
     - సోడదాసి సరోజని, రక్షణ గ్రూప్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement