బడి బాటే బతుక్కి బంగారు బాటని ఆ గ్రామస్తులు వందేళ్ల క్రితమే గుర్తించారు. నాలుగక్షరాలు నేర్చుకుని జ్ఞానం పెంచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తావని తమ పిల్లలకు ఉగ్గుపాల నుంచే నూరిపోశారు. అలా స్వాతంత్య్రానికి ముందు మొదలైన ప్రస్థానం దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. కమ్యూనిస్ట్ ఉద్యమాలనుంచి రాజకీయరంగం వరకూ, సాధారణ ప్రభుత్వ కొలువుల నుంచి అత్యుత్తమ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల వరకు ఆ గ్రామానికి చెందిన ఎంతో మంది దేశ విదేశాల్లో తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. శతశాతం అక్షరాస్యతతో సరస్వతీ నిలయంగా విలసిల్లుతున్న ఆ గ్రామమే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని సంకువారిగుంట.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సంకువారిగుంట బ్రిటిష్ కాలంలో ఏర్పడిన గ్రామం. 1890–1900 సంవత్సరాల మధ్య ఈ గ్రామం ఏర్పడినట్లు పెద్దలు చెబుతుంటారు. బ్రిటిష్‌వారి కాలంలో పంట పొలాలకు కాపలాగా ఉండేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది తదనంతర కాలంలో అక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1916లోనే ఇక్కడ క్రైస్తవ మిషనరీ ప్రాథమిక పాఠశాల ఉన్నట్లు పాత గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతం కలిసి ఉన్నప్పటి రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 1953లో అది మేనేజ్‌మెంటు ప్రాథమిక పాఠశాలగా మారింది. ప్రస్తుతం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి వరకు మాత్రమే ఉంది. అనంతరం గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఈ గ్రామ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతుంటారు.
రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజశేఖర్
ఓఎన్‌జీసీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సంకువారిగుంటకు చెందిన డి.ఎం.రాజశేఖర్ తన పరిశోధనలకు గాను 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. శాస్త్రవేత్త దుగ్గిరాల మోజెస్ రత్నశేఖర్ శాస్త్రవేత్తగా 50కి పైగా పరిశోధనా పత్రాలు వెలువరించారు. ఈయనతో పాటు మరో 10 మంది ఓఎన్‌జీసీ. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు.
చిన్న గ్రామంలో 250 మంది ప్రభుత్వ ఉద్యోగులు
500 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో సుమారు 250 మంది వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. బ్యాంకు, రైల్వే, పోలీస్, మిలటరీ, నేవీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ గ్రామానికి చెందినవారు ఉన్నారు. రాజకీయంగానూ సంకువారిగుంట చైతన్యవంతమైన గ్రామం. బెజ్జం సంజీవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జూపూడి ఎమ్మెల్సీగా పనిచేశారు. 1960లో డీటీ మోజెస్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతనూతలపాడు స్థానానికి పోటీ చేశారు.
గురువుల దక్షత వల్లే చదువులు...
గతంలో ఇక్కడ పనిచేసిన గురువుల దీక్ష, దక్షతల వల్లే గ్రామస్తులకు విద్యాబుద్ధులు అలవడ్డాయి. పిల్లలు పొలం పనుల్లో కాదు..పాఠశాలలో ఉండాలి అని వారు చెప్పిన మాట గ్రామస్తులను ఆలోచింపజేసింది. గతంలో గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పిల్లి సుందరరావు, పిల్లి జయరావు సోదరులు గ్రామస్తులను విద్యాబుద్ధుల వైపు మళ్లించారు. గ్రామంలో మొదటి ప్రభుత్వ ఉద్యోగి అయిన మోజెస్ ఉపాధ్యాయుడిగా గ్రామస్తుల్లో మరింత మార్పు తీసుకొచ్చారు. ఆయన ఒంగోలులో 1952లో ఠాగూర్ ట్యుటోరియల్‌ను స్థాపించి గ్రామం నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడ్డారు.
స్వగ్రామంలో 36 ఏళ్లు పనిచేశా
నేను పుట్టిన ఊరిలోనే ప్రాథమిక విద్య అభ్యసించాను. తదనంతర కాలంలో ఉపాధ్యాయుడిగా 39 ఏళ్లు పనిచేస్తే 36 సంవత్సరాలు మా ఊరిలోనే పనిచేసే అవకాశం దక్కింది. నాకంటే ముందు మా అన్న సుందరరావు 40 సంవత్సరాలు ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సొంత ఊరికి చెందిన వందల మంది పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశం మా కుటుంబానికి లభించింది. – పిల్లి జయరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు
ప్రతి ఒక్కరి దృష్టీ చదువు పైనే..
మొదటి నుంచీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే దృక్పథంతోనే ముందుకు సాగుతున్నారు. మా గ్రామానికి చెందిన వారు మన రాష్ట్రంలోనే కాక అనేక రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. పూర్వం నుంచి మా పెద్దలు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. నేను కూడా మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నాను. మా పెద్దమ్మాయి ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తోంది. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్నమ్మాయి ఇంటర్ చదువుతోంది. – దుగ్గిరాల విజయకుమార్, గ్రామస్తుడు
Comments
Please login to add a commentAdd a comment