సంక్షోభం ముప్పిరిగొన్నా.. సంక్షేమానికే పెద్ద పీట | Funding of zero interest scheme for Dwarkra societies on April 24th | Sakshi
Sakshi News home page

సంక్షోభం ముప్పిరిగొన్నా.. సంక్షేమానికే పెద్ద పీట

Published Wed, Apr 22 2020 3:45 AM | Last Updated on Wed, Apr 22 2020 3:45 AM

Funding of zero interest scheme for Dwarkra societies on April 24th - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతున్న సంక్లిష్ట తరుణంలోనూ ప్రజా సంక్షేమం పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటోంది. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల కోసం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ కింద  రూ.1,400 కోట్లను ఈ నెల 24న ఆయా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది. తద్వారా 8.78 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది. 

పేద విద్యార్థులకు ఊరట
► రాష్ట్రంలోని 11.50 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సోమవారం ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 
► రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకోడానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 
► గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం స్ఫూర్తిని నీరుగార్చింది. పలు ఆంక్షలు, నిబంధనలను పెట్టి ఈ పథకం కింద కోత విధించింది. దాంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మిగిలిన మొత్తాన్ని బలవంతంగా వసూలు చేసేవి.
► గత చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది.  రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యకు ముగింపు పలికింది. విద్యార్థుల ఫీజు ఎంత అయితే అంత మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
► అందుకు అనుగుణంగానే వచ్చే సోమవారం ఆ మేరకు నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) సంబంధించిన మొత్తాన్ని ఇకపై తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. వారు కళాశాలలకు ఆ మొత్తాన్ని ఫీజుగా చెల్లిస్తారు. తద్వారా వారు పిల్లల చదువు సాగుతున్న తీరు  తెలుసుకునే వీలుంటుంది.  

సీఎం జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు
కరోనా వైరస్‌ ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వ విపత్తు నిధుల నుంచి ప్రతి అర్చకునికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ప్రభుత్వ నిర్ణయించడంపై ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అర్చక సమఖ్య ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.

పోలీస్‌ అధికారుల సంఘం కృతజ్ఞతలు 
రాష్ట్రంలో పోలీస్, హోంగార్డ్స్‌ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు సిబ్బందికి, హోంగార్డులకు మాస్క్‌లు, శానిటైజర్స్‌ అందించేందుకు ప్రభుత్వం రూ.2.89 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement