నిధులు మింగిన బాబు | Funds Diverting in Marketing Psr Nellore | Sakshi
Sakshi News home page

నిధులు మింగిన బాబు

Published Sat, Jun 1 2019 12:06 PM | Last Updated on Sat, Jun 1 2019 12:06 PM

Funds Diverting in Marketing Psr Nellore - Sakshi

నార్తురాజుపాళెంలోని గిడ్డంగి

మార్కెటింగ్‌ శాఖ నిధులను చంద్రబాబు సర్కారు దారి మళ్లించింది. ఫలితంగా రైతు బంధు పథకం నిలిచిపోయింది. ఎంతో ఆత్రుతగా గిడ్డంగుల్లోకి ధాన్యాన్ని తరలించిన రైతులకు నిరాశ ఎదురైంది. తక్షణ అవసరాలు తీరక అప్పులు చేయాల్సి వస్తోంది. కొందరు రైతులైతే రైతు బంధు రుణాలు నిలిచాయని తెలుసుకుని     నష్టానికే అమ్ముకున్నారు.

కొడవలూరు: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు అన్నదాతలు నష్టపోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా మార్కెటింగ్‌ శాఖ గిడ్డంగుల్లో ఈ పథకం కింద భద్రపరచుకోవచ్చు. ఇలా భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ముందుగానే మార్కెటింగ్‌ శాఖ వారు ఇచ్చేస్తారు. ఈ మొత్తంతో రైతులు తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మార్కెటింగ్‌ శాఖ రైతులకిచ్చిన మొత్తానికి ఆర్నెల్ల దాకా ఎలాంటి వడ్డీ ఉండదు. రైతు మంచి ధరకు ధాన్యం అమ్ముకున్నప్పుడు మాత్రమే తీసుకున్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒక్కో రైతుకు రూ.2 లక్షల దాకా మాత్రమే రుణం కింద ఇస్తారు. ఒక వేళ ఆర్నెల్లకు పైబడినా గిడ్డండుల్లో ఉంచితే మాత్రం తీసుకున్న రుణానికి అతి తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్నెల్లలోపే విక్రయించుకుంటారు. గనుక వడ్డీ సమస్య ఉండదు.

ఆశలు అడియాసలు
రైతు బంధు పథకం అమలులో కోవూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రబీలో మరో ఆరు వేల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ మార్కెట్‌ కమిటీ సెస్సు వసూళ్లలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఆ నిధులనే రైతు బంధు పథకం ద్వారా రైతులకు రుణాలిస్తూ వస్తున్నారు. కమిటీ పరిధిలోని నార్తురాజుపాళెం మార్కెట్‌ యార్డ్‌లో కొత్తగా మరో ఆరు వేల మెట్రిక్‌ టన్నుల గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ రబీ పంటకు రైతు బంధు పథకం మరింత విస్తరించాలని సంకల్పించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న నిధులన్నింటినీ చంద్రబాబు సర్కారు లాగేసుకోవడంతో ఈ రబీ రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేశారు.

రైతులకు మొండిచేయి
కోవూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో కోవూరు, కొడవలూరు,విడవలూరు, అల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, దగదర్తి మండలాలున్నాయి. ఈ మండలాలన్నీకూడా పూర్తిగా డెల్టా మండలాలే కావడంతో లక్షా 30 వేల ఎకరాల దాకా వరి సాగవుతుంది. అన్నీ డెల్టా మండలాలే కావడంతో సెస్సు వసూలు గణనీయంగా ఉంది. నిర్దేశించిన సెస్సు లక్ష్యాలను ఛేదించడంలోనూ జిల్లాలోనే ముందంజలో ఉంది. జిల్లాలో 11 మార్కెట్‌ కమిటీలుండగా, వీటి సెస్సు వసూలు లక్ష్యం రూ.26.16 కోట్లు కాగా జిల్లాలోని అన్ని కమిటీలు కలిపి కేవలం రూ.24.14 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. కోవూరు మార్కెట్‌ కమిటీ మాత్రం లక్ష్యం రూ.5.20 కోట్లు కాగా, రూ.5.90 కోట్లు వసూలు చేసింది. సెస్సు రూపంలో వచ్చిన మొత్తాన్ని రైతు బంధు పథకానికి వినియోగించుకునే వెసులుబాటు ఉండడం, అదనంగా గిడ్డంగులు అందుబాటులోకి రావడంతో ఈ రబీలో 480 మంది రైతులకు రైతు బంధు రుణాలివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది కేవలం 271 మంది రైతులకే రైతు బంధు రుణాలిచ్చారు. కమిటీలో గతంలోని రూ.8 కోట్లు నిధులుండడంతోపాటు ఈ రబీలో రూ.6 కోట్ల దాకా సెస్సు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ నిధులన్నీ బాబు సర్కారు లాగేసుకొంది.

రైతుల పరిస్థితి దయనీయం
రైతు బంధు రుణాలిస్తారు గనుక తక్షణ అవసరాలు గడుపుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామన్న ఉద్దేశంతో రైతులు అధికారుల లక్ష్యాల మేర గిడ్డంగులకు సరిపడా ధాన్యం నిల్వ బెట్టారు. తీరా రుణాలు చేతికందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు పంట సమయంలో ఎరువులు, పురుగు మందులు తదితరాలన్నీ దుకాణాల్లో అప్పు కింద తెస్తారు. పంట చేతికందాక వారి అప్పు చెల్లించేస్తారు. రైతులు ధాన్యం అమ్ముకోకపోయినా రైతు బంధు రుణం తీసుకుని అప్పు చెల్లిస్తారు. రుణమందుతుందని భావించి ధాన్యం గిడ్డంగుల్లో ఉంచిన వారి పరిస్థితి అప్పులు చేయాల్సి వస్తోంది.

ఆర్థికపరమైన చిక్కుల వల్లే
ఆర్థికపరమైన కొన్ని చిక్కుల వల్ల రైతు బంధు పథకాన్ని ఇప్పటి దాకా అమలు చేయలేదు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. సమస్య పరిష్కారమైన వెంటనే రైతు బంధు రుణాలిస్తాం.  
– ఉపేంద్రకుమార్,ఏడీ మార్కెటింగ్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement