సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఏ సంఘానికి ఎంత మొత్తం జీరో వడ్డీ కింద చెల్లిందన్న బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అక్కచెల్లెమ్మల ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించింది. ‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నేరుగా వారికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ సున్నా వడ్డీకి రుణాల విప్లవం తెస్తాం. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది’ అని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని ఏడాది తర్వాత నుంచి నాలుగు దఫాల్లో చెల్లించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. వైఎస్సార్ ఆసరా పథకం అమలయ్యే వరకు అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం ఉండకూడదని ఆ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలుత ఐదు నెలల డబ్బులను అక్టోబరు 2వ తేదీలోగా జమ చేయనుంది.
ప్రతి నెలా వడ్డీ రూ.204 కోట్లు
ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పులు ఉన్నట్టు బ్యాంకర్ల సంఘం నిర్ధారించింది. ఈ వివరాలతో సెర్ప్, మెప్మా అధికారులు రాష్ట్ర మంతటా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి, ఏ సంఘానికి ఎంత అప్పు ఉందో తీర్మానం చేయించి, దానిని బ్యాంకు అధికారుల ద్వారా సర్టిఫై చేయిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 99 శాతం సంఘాలతో సమావేశాలు నిర్వహించే ప్రక్రియ పూర్తయింది. సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో 6,01,132 సంఘాల పేరిట రూ.19,504 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,50,042 సంఘాల పేరిట రూ.4,587.71 కోట్లు అప్పు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంఘాల వారీగా ఉన్న అప్పుపై ప్రతి నెలా సుమారు రూ.204 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
జీరోవడ్డీ పాస్ పుస్తకాలు
సంఘం వారీగా ఉన్న అప్పు మొత్తం, దానిపై ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ వివరాలతో పాటు ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీగా బ్యాంకుకు చెల్లించిన రశీదు వివరాలు నమోదు చేయడానికి సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలను తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత ప్రభుత్వం తొలి విడతగా సుమారు రూ.1,020 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత వాటికి సంబంధించిన రశీదులు మహిళలకు అందజేసే సమయంలోనే ఈ పాస్‌పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా ప్రభుత్వం సంఘాల వారీగా బ్యాంకులకు చెల్లించిన జీరో వడ్డీ రశీదులను అందజేసి, సంఘాల వద్ద ఉండే ఆ పాస్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు
Published Thu, Aug 29 2019 4:15 AM | Last Updated on Thu, Aug 29 2019 8:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment