వధూవరులకు శుభవార్త ! | Funds Released Under YSR Pelli Kanuka Scheme | Sakshi
Sakshi News home page

వధూవరులకు శుభవార్త !

Published Sat, Feb 15 2020 9:01 AM | Last Updated on Sat, Feb 15 2020 9:01 AM

Funds Released Under YSR Pelli Kanuka Scheme - Sakshi

సాక్షి, అమరావతి:  పెళ్లి చేసి చూడు...ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. నిరుపేద కుటుంబాలలో పెళ్లి చేసి అప్పులు పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటానికి గత ప్రభుత్వం ఏప్రిల్‌ 20, 2018న ప్రవేశపెట్టిన పథకం చంద్రన్న పెళ్లి కానుక. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టి కేవలం దాన్ని ప్రచారం కోసమే వాడుకున్నారు. పథకానికి అన్ని అర్హతలు ఉండి ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తి అయిన దంపతులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్షేమ పథకాలద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడుకున్న గత ప్రభుత్వం వారికి రిక్త హస్తమే చూపింది.  

రూ. 23.34 కోట్ల బకాయిల విడుదల 
ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం  విడుదల చేసింది. దాదాపు 22 నెలలగా ఎదురు చూస్తున్న జంటల వ్యక్తిగత అకౌంట్లలలోకి డబ్బులు జమకానున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలో ఏప్రిల్‌ 20, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2020 వరకు పెళ్లి కానుక పథకానికి 9,910 జంటలు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తర్వాత అర్హత సాధించాయి. వారి వారి కులాలు, వర్గాల వారీగా ఆయా జంటలకు రూ.41.12 కోట్ల చెల్లించాలి. గతం ప్రభుత్వం ప్రచారం చేసుకోవటానికి, తన వర్గాల వారి కోసం కేవలం రూ.17.78 కోట్లను విడుదల చేసింది. జిల్లాలో మరో  రూ.23.34 కోట్ల బకాయిల కోసం ఎదురు చూస్తున్న వారికి జగనన్న ప్రభుత్వం నిధులను విడుదల చేసింది . ఈ తాజా నిర్ణయంతో 5,861 జంటలకు లబ్ధి చేకూరనున్నది.

శ్రీరామనవమి నుంచి పెంచిన నగదు అందజేత... 
పేదింటి పిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం కార్యరూపం దాల్చింది.  ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి పథకాన్ని సరికొత్తగా  వైఎస్సార్‌ పెళ్లి కానుకగా మార్చారు. పెంచిన నగదును రానున్న శ్రీరామ నవమి నుంచి అమలు చేయనున్నారు. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద ఇచ్చేవారు. ప్రస్తుతం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వారందరికీ ఏకంగా లక్ష రూపాయలను ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేల ను ఇప్పుడు రూ.1.20 లక్షలకు పెంచారు. బీసీ ఆడపడుచులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు, కులాంతర వివాహాలు చేసుకొనే ఆడపడుచులకు రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

భవన నిర్మాణ కార్మికులకు ఐదింతలు పెంపు... 
భవన నిర్మాణ కార్మికుల  పెళ్లి కానుకను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఏకంగా ఐదు రెట్లు పెంచి రూ.20 వేల నుంచి  రూ.లక్షకు చేశారు. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా  పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారి  కూతుర్లకు కూడా పెళ్లి కానుకను అమలు చేస్తున్నారు. అయితే  భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉందని ఆధికారులు చెబుతున్నారు. పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 52 జంటలు మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్నారు, అందులో ముగ్గురు అనర్హత పొందారు. అవగాహన లేకపోవటంతో ప్రభుత్వ సాయానికి వీరు దూరం అవుతున్నారంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లి  సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. 

పెంచిన పెళ్లి కానుక వివరాలు
► ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష 
► ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. లక్షా 20 వేలు  
► ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్ష 
► బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలు 
► బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలు 
► మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష 
► దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర 
► భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్ష  

► వైఎస్సార్‌ పెళ్లి కానుకకు ఏప్రిల్‌ 20, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2020 వరకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించిన  జంటలు – 9,910. 
► 9,910 జంటలకు అందజేయాల్సిన మొత్తం – రూ.41.12 కోట్లు 
► ఇప్పటి వరకు పెళ్లి కానుక పొందిన జంటలు –4,049 
► పెళ్లి కానుక రూపంలో ప్రభుత్వం చేసిన సాయం –రూ.17.78 కోట్లు 
► తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలు  – రూ.23.34 కోట్లు 
► ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్న జంటలు –5,861

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement