పెద్దాసుపత్రిలో ఎలుకలు పడుతున్న దృశ్యం
మన ఇంట్లోకి ఎలుకలు వస్తుంటే ఏం చేస్తాం.. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ఎలుకలు, పాములు వంటివి రాకుండా అవసరమైన చర్యలు చేపడతాం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ పరిస్థితి లేదు. ఎలుకలు, పాములు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ వాటి సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పేరిట ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు ఎటు పోతున్నాయో, వాటిని ఏ మాయదారి ఎలుకలుమింగేస్తున్నాయో తెలియని పరిస్థితి.
కర్నూలు, (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ (చెదలు, ఎలుకల నియంత్రణ) బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్ నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు అప్పట్లో నెలకు రూ.5 లక్షలకు పైగా అందజేసేది. ఈ మొత్తంలో ఏటా మూడు శాతం పెరుగుదల ఉంటోంది. ఈ మేరకు ప్రస్తుతం నెలకు రూ.6 లక్షల దాకా చెల్లిస్తున్నారు. ఈ సంస్థలో ఎనిమిది మంది వర్కర్లు, ఒక సూపర్‌వైజర్‌పనిచేస్తున్నారు. వర్కర్లు ఆసుపత్రిలోని ఎలుకలు, పందికొక్కులను పట్టుకోవడం, పాములను గుర్తించి అవి దరిదాపులకు రాకుండా చేయడం, బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాలను నివారించడం వీరి విధి. ఇందుకోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు ఎలుకలు, పందికొక్కులను పట్టుకునేందుకు బోన్లు, గమ్‌ప్యాడ్‌లు పెట్టాలి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం పాములను చంపకూడదు. కాబట్టి ఆసుపత్రి పరిసరాల్లో తిరిగే పాములను గుర్తించి, అవి మళ్లీ అటువైపు రాకుండా మందు చల్లాల్సి ఉంటుంది. అయితే..ఈ పనులను పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఎలుకలు, పందికొక్కులు ఏటా పెరిగిపోతున్నట్లు విమర్శలున్నాయి. అలాగే పాములు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించినా..అవి కూడా ఆసుపత్రి పరిసరాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
రూ.1.46 కోట్ల ఖర్చు
ఆసుపత్రిలో 2016 జూన్ 7 నుంచి చెదలు, ఎలుకలు, పాముల నియంత్రణ పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థకు 2016లో రూ.29,69,838, అలాగే 2017లో రూ.52,93,947లు, 2018లో రూ.63,33,697 కలిపి.. మొత్తం 31 నెలల్లో రూ.1,45,97,482 చెల్లించారు. ప్రతి సంవత్సరం నిధులు ఖర్చవుతూనే ఉన్నాయి గానీ ఎలుకలు, పందికొక్కులు, పాములు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆసుపత్రి పరిసరాల్లో, వార్డుల్లో సంచరిస్తున్నాయి. ఆసుపత్రిలోని వెనుక వైపున ఉన్న ఖాళీ ప్రాంతాల్లో పదుల కొద్దీ పెద్ద పాములు సంచరిస్తున్నట్లు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెనుక వైపున ముళ్లకంపలు పెరగడం, మురుగుకుంటలు ఉండటం కారణంగా క్రిమికీటకాలు అధికంగా ఉంటున్నాయి. దీనికితోడు ఇక్కడే పందులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. అవి సాయంత్రం వేళల్లో వార్డుల్లోకి వచ్చేస్తున్నాయి.
పూర్తిగా మార్కులు వేయడం లేదు
పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ చేసే సంస్థకు మొదటి నుంచి పూర్తిస్థాయిలో మార్కులు వేయడం లేదు. 96 మార్కులు వేస్తేనే వారికి పూర్తిస్థాయి నిధులు విడుదలవుతాయి. కానీ మేము ఇప్పటివరకు 74 నుంచి 94 వరకు మాత్రమే ఇచ్చాం. మొదటి కంటే ఇప్పుడు వారి పనితీరులో మార్పు వచ్చింది. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. –డాక్టర్ భగవాన్, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment