rats problem
-
కోట్లు మింగిన..మాయదారి ఎలుకలు
మన ఇంట్లోకి ఎలుకలు వస్తుంటే ఏం చేస్తాం.. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ఎలుకలు, పాములు వంటివి రాకుండా అవసరమైన చర్యలు చేపడతాం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ పరిస్థితి లేదు. ఎలుకలు, పాములు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ వాటి సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పేరిట ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు ఎటు పోతున్నాయో, వాటిని ఏ మాయదారి ఎలుకలుమింగేస్తున్నాయో తెలియని పరిస్థితి. కర్నూలు, (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ (చెదలు, ఎలుకల నియంత్రణ) బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్ నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు అప్పట్లో నెలకు రూ.5 లక్షలకు పైగా అందజేసేది. ఈ మొత్తంలో ఏటా మూడు శాతం పెరుగుదల ఉంటోంది. ఈ మేరకు ప్రస్తుతం నెలకు రూ.6 లక్షల దాకా చెల్లిస్తున్నారు. ఈ సంస్థలో ఎనిమిది మంది వర్కర్లు, ఒక సూపర్వైజర్పనిచేస్తున్నారు. వర్కర్లు ఆసుపత్రిలోని ఎలుకలు, పందికొక్కులను పట్టుకోవడం, పాములను గుర్తించి అవి దరిదాపులకు రాకుండా చేయడం, బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాలను నివారించడం వీరి విధి. ఇందుకోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు ఎలుకలు, పందికొక్కులను పట్టుకునేందుకు బోన్లు, గమ్ప్యాడ్లు పెట్టాలి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం పాములను చంపకూడదు. కాబట్టి ఆసుపత్రి పరిసరాల్లో తిరిగే పాములను గుర్తించి, అవి మళ్లీ అటువైపు రాకుండా మందు చల్లాల్సి ఉంటుంది. అయితే..ఈ పనులను పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఎలుకలు, పందికొక్కులు ఏటా పెరిగిపోతున్నట్లు విమర్శలున్నాయి. అలాగే పాములు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించినా..అవి కూడా ఆసుపత్రి పరిసరాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రూ.1.46 కోట్ల ఖర్చు ఆసుపత్రిలో 2016 జూన్ 7 నుంచి చెదలు, ఎలుకలు, పాముల నియంత్రణ పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థకు 2016లో రూ.29,69,838, అలాగే 2017లో రూ.52,93,947లు, 2018లో రూ.63,33,697 కలిపి.. మొత్తం 31 నెలల్లో రూ.1,45,97,482 చెల్లించారు. ప్రతి సంవత్సరం నిధులు ఖర్చవుతూనే ఉన్నాయి గానీ ఎలుకలు, పందికొక్కులు, పాములు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆసుపత్రి పరిసరాల్లో, వార్డుల్లో సంచరిస్తున్నాయి. ఆసుపత్రిలోని వెనుక వైపున ఉన్న ఖాళీ ప్రాంతాల్లో పదుల కొద్దీ పెద్ద పాములు సంచరిస్తున్నట్లు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెనుక వైపున ముళ్లకంపలు పెరగడం, మురుగుకుంటలు ఉండటం కారణంగా క్రిమికీటకాలు అధికంగా ఉంటున్నాయి. దీనికితోడు ఇక్కడే పందులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. అవి సాయంత్రం వేళల్లో వార్డుల్లోకి వచ్చేస్తున్నాయి. పూర్తిగా మార్కులు వేయడం లేదు పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ చేసే సంస్థకు మొదటి నుంచి పూర్తిస్థాయిలో మార్కులు వేయడం లేదు. 96 మార్కులు వేస్తేనే వారికి పూర్తిస్థాయి నిధులు విడుదలవుతాయి. కానీ మేము ఇప్పటివరకు 74 నుంచి 94 వరకు మాత్రమే ఇచ్చాం. మొదటి కంటే ఇప్పుడు వారి పనితీరులో మార్పు వచ్చింది. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. –డాక్టర్ భగవాన్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ -
ఎలుకల నష్టం అపారం
అమలాపురం: కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు చేసే నష్టం అంతా ఇంతా కాదని, వీటిని సకాలంలో గుర్తించి తగు చర్యలు తీసుకోకుంటే రైతులు భారీగా నష్టపోతారని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నరేష్, డాక్టర్ పి.శక్తివేల్ తెలిపారు. అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు నివారణ, బిందు సేద్యంపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఏడీహెచ్ సిహెచ్.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ దేశం మొత్తం మీద 104 ఎలుక జాతులు ఉన్నాయని, వీటిలో 14 జాతులు వ్యవసాయ, ఉద్యాన పంటలను నష్టపురుస్తాయని, దీనిలో నాలుగు జాతులు అత్యంత తీవ్ర నష్టం చేస్తాయని వారు తెలిపారు. ఎలుకల పళ్లు రోజుకు 0.04ఎంఎం ఎదుగుతాయని, దాని వలన వాటిని నియంత్రించడానికి ఎదురు వచ్చినవాటిని కొరికిపడేస్తాయని తెలిపారు. వరి రైతులు 96:2:2 పాళ్లలో నూకలు/ ఏదైనా ఎర:నూనె:విషం (బ్రోమోడయోలిన్) కలిపి బొరియల్లో వేయాలన్నారు. కొబ్బరి తోటల్లో సైతం ఇదే విధానంలో మందును తయారు చేసి చెట్టు మొవ్వు వద్ద ఉంచాలన్నారు. కోకోలో విషం కలిపిన పొట్లాలను ఏదైనా గొట్టం లేదా వెదురు బొంగులలో ఉంచడం వల్ల ఇతర జంతువులకు హాని తప్పించే అవకాశముందని శాస్త్రవేత్తలు నరేష్, శక్తివేల్ తెలిపారు. ఏపీ ఎంఐపీ పీడీ ఎస్.రామమోహన్ మాట్లాడుతూ చుట్టూ గోదావరి ఉన్నంత మాత్రాన బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) అవసరం లేదన్నట్టు రైతులు అనుకోవడం మంచిది కాదని, ఇక్కడ తప్పనిసరిగా బిందు సేద్యాన్ని వినియోగించాల్సి ఉందన్నారు. బిందు సేద్యం ప్రోత్సాహానికి ప్రభుత్వం భారీగా రాయితీలందిస్తోందన్నారు. ఐదు ఎకరాలలోపు ఓసీ, బీసీ రైతులకు 90 శాతం, 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 70 శాతం, 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాల లోపు 100 శాతం, 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 70 శాతం, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులకు 50 శాతం రాయితీ అందిస్తోందని ఆయన వివరించారు. తుంపర్లకు 2 అంగుళాల నుంచి 4 అంగులాల పైపులు వరకు 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. బిందు సేద్యం వల్ల ఎరువులు ఆదా చేయడంతో పాటు దిగుబడి 10 శాతం వరకు పెరుగుతుందని ఆయన వివరించారు. ఉద్యానశాఖ ఏవోలు, ఎంపీఈవోలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎలుకలకు చెలగాటం.. రైల్వేకి ప్రాణసంకటం
హైదరాబాద్: పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడి న్నట్లు... ఎలుకలు, బొద్దింకలు మన దక్షిణ మధ్య రైల్వేను ఆటాడుకుంటున్నాయి. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు. ఎలుకను పట్టడం చిన్న విషయంగా చూస్తాంగానీ.. అది ఎంత కష్టమో రైల్వే సిబ్బందిని అడిగితే తెలుస్తుంది. మొత్తంగా వారు కిందా మీదా పడి నెలకు సగటున 773 ఎలుకలను పట్టుకుంటున్నారు.. 31,368 బొద్దింకలను చంపుతున్నారు. ఇక ఉన్నట్టుండి ప్రయాణికులను హాహా కారాలు పెట్టించే నల్లుల సంఖ్యకు లెక్కే లేదు. ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో రూపొందించిన అధికారిక నివేదికలోని లెక్కలే! దీనిని జీఎం శ్రీవాత్సవ అధికారికంగా రైల్వే భద్రత అంశంలో కూడా చేర్చారు. ప్రత్యేకంగా బోగీల్లో బోనులు ఏర్పాటు చేసి మరీ ఎలుకలను పట్టుకుంటున్నామని.. రసాయన జెల్‌తో బొద్దింకలను నిర్మూలిస్తున్నామని.. హాట్ ఎయిర్ బ్లోయర్స్, ప్రత్యేక ఇన్సెక్టిసైడ్ గన్స్ ద్వారా నల్లులను చంపుతున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రతి ఏసీ బోగీని 15 రోజులకోసారి, సాధారణ బోగీని నెలకోసారి రసాయనాలతో ఫ్యూమిగేషన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, బోగీల సంగతి పక్కనబెడితే.. రైల్వేస్టేషన్ల పరిసరాల్లో మాత్రం ఎలుకలు, బొద్దింక లు విజృంభిస్తూనే ఉండడం గమనార్హం.