హైదరాబాద్: పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడి న్నట్లు... ఎలుకలు, బొద్దింకలు మన దక్షిణ మధ్య రైల్వేను ఆటాడుకుంటున్నాయి. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు. ఎలుకను పట్టడం చిన్న విషయంగా చూస్తాంగానీ.. అది ఎంత కష్టమో రైల్వే సిబ్బందిని అడిగితే తెలుస్తుంది. మొత్తంగా వారు కిందా మీదా పడి నెలకు సగటున 773 ఎలుకలను పట్టుకుంటున్నారు.. 31,368 బొద్దింకలను చంపుతున్నారు. ఇక ఉన్నట్టుండి ప్రయాణికులను హాహా కారాలు పెట్టించే నల్లుల సంఖ్యకు లెక్కే లేదు. ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో రూపొందించిన అధికారిక నివేదికలోని లెక్కలే! దీనిని జీఎం శ్రీవాత్సవ అధికారికంగా రైల్వే భద్రత అంశంలో కూడా చేర్చారు.
ప్రత్యేకంగా బోగీల్లో బోనులు ఏర్పాటు చేసి మరీ ఎలుకలను పట్టుకుంటున్నామని.. రసాయన జెల్‌తో బొద్దింకలను నిర్మూలిస్తున్నామని.. హాట్ ఎయిర్ బ్లోయర్స్, ప్రత్యేక ఇన్‌సెక్టిసైడ్ గన్స్ ద్వారా నల్లులను చంపుతున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రతి ఏసీ బోగీని 15 రోజులకోసారి, సాధారణ బోగీని నెలకోసారి రసాయనాలతో ఫ్యూమిగేషన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, బోగీల సంగతి పక్కనబెడితే.. రైల్వేస్టేషన్ల పరిసరాల్లో మాత్రం ఎలుకలు, బొద్దింక లు విజృంభిస్తూనే ఉండడం గమనార్హం.