మృతదేహల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
డెంకాడ : మండలంలోని మోదవలసలో తండ్రీ, కుమార్తెలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో కుమార్తె మరణించడంతో తట్టుకోలేక చిన్నారి తండ్రి కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో నివాసముంటున్న కానూరి సత్యశ్రీధర్, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉదయశ్రీ కాగా రెండో కుమార్తె గౌతమిశ్రీ. కొద్ది రోజులుగా గౌతమిశ్రీకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం ఉదయం మృతి చెందింది.
వ్యక్తిగత పనిమీద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వెళ్లిన తండ్రి శ్రీధర్‌కు కుటుంబ సభ్యులు విషయం తెలియజేశారు. కుమార్తె మరణం వార్త విన్న శ్రీధర్ తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తండ్రీ,కుమార్తెల మృతదేహాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే సత్యశ్రీధర్ భార్య సుజాత, పెద్ద కుమార్తె ఉదయశ్రీ రోదించిన తీరు చూపరులను కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment