తల్లిన కోల్పోయిన బిడ్డ.. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. స్నేహితులు, బంధువులను కోల్పోయిన సహచరులు.. రక్త సంబంధీకులంతా ఘొల్లుమనడంతో ఆ గ్రామం కన్నీటి సంద్రంగా మారింది. సహచరులు తమ కళ్ల ముందే విగత జీవులు కాగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు ప్రమాదాన్ని తలచుకుని గగుర్పాటుకు గురవుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మాచవరం సమీపంలో గురువారం మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. వారందరి మృతదేహాలను శుక్రవారం ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం ఇళ్లకు తరలించారు. దీంతో మాచవరంలో రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే సుధాకర్ బాబు దగ్గరుండి మృతుల బంధువులతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పల్లె కన్నీరు పెట్టింది....
నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా పది మందిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. గురువారం సాయంత్రం మండలంలోని రాపర్ల పొలాల్లో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. మాచవరానికి చెందిన తొమ్మిది మందితో పాటు చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడుకు చెందిన మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. కాకుమాను భాగ్యవతి అనే మహిళ జీజీహెచ్‌లో మృత్యువుతో పోరాడుతోంది. ట్రాక్టర్ ట్రక్కు తగిలి విద్యుత్ స్తంభం విరిగి కరెంట్ తీగలు తగిలి మృత్యువాత పడిన పది మంది మృతదేహలకు శుక్రవారం ఉదయం 9 గంటల్లోపే అధికారులు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహలను ఉదయం 10 గంటల్లోపు మాచవరం తరలించి బంధువుల రోదనలు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల సూచనలు మేరకు పోలీసులు మృతదేహలను నేరుగా శ్మశాన వాటికకే తీసుకెళ్లారు. మృతుల్లో విద్యార్థులు, విద్యార్థినులు కూడా ఉండటంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
తొమ్మిది మృతదేహాలు మాచవరంలో ఖననం
తొమ్మిది మంది మృతదేహాలను మాచవరంలో ఖననం చేశారు. ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో ఖననం చేశారు. గ్రామంలోని పెద్ద మాలపల్లెకు చెందిన వారిలో ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో వేర్వేరుగా ఖననం చేశా>రు. ఇక్కడ ఖననం చేసిన మృతదేహాలు పీకా కోటేశ్వరమ్మ, నూకతోటి లక్ష్మమ్మ, కాకుమాను రమాదేవి, ఆమె కొడుకు శివ, కాకుమాను కుమారి, కాకుమాను మౌనిక, కాకుమాను అమూల్యవి. మాచవరం గ్రామ శ్మశాన వాటికలోనే పొక్లెయిన్‌తో గొయ్యిలు తవ్వించి సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు. మృతుల్లో గోళ్ల రవిశంకర్ మృతదేహం అతడి స్వగ్రామం చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నల్లూరి చెంచయ్య మృతదేహానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి శ్మశాన వాటికలో ఖననం చేశారు. కాకుమాను రవీంద్ర అనే మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారి సొంత పొలంలో సమాధి చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఒంగోలు నుంచి మాచవరానికి మృతదేహాలతో పాటు వచ్చారు. ఆయన దగ్గరుండి జేసీబీ సాయంతో గోతులు తీయించి మృతదేహాలను ఖననం చేయించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రభుత్వం అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే టీజేఆర్ భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు వైవీ పరామర్శ
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మాచవరం బాధిత కుటుంబాలను టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.
నర్స్ అవుదామని..
ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఇరువురు స్నేహితులు మరణంలోనూ ఒక్కటయ్యారు. మాచవరం గ్రామానికి చెందిన కాకుమాను అమూల్య(16), కాకుమాను మౌనిక(18)ఇరువురూ బంధువులు. బంధుత్వంతో పాటు ఇద్దరూ ఒకరిని మరొకరు విడిచిపెట్టి ఉండరు. నర్సింగ్ డిప్లొమో మొదటి సంవత్సరం చదువుతుండగా, మౌనిక ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇద్దరూ ఇంటి వద్దే ఖాళీగా ఉండటమెందుకని ఇద్దరూ కలిసి మిర్చి కోతలకోసం కూలీ పనులకు వెళ్ళారు. చిన్ననాటి నుంచి కలిసి, మెలసి ఎంతో ప్రేమ, ఆప్యాతలతో ఉంటున్న వీరిద్దరి చూసి మృత్యువుకే కన్నుకుట్టినట్లయింది. అంతే ఎంతో స్నేహంగా ఉంటున్న వీరిద్దరినీ కలిసి కభళించుకుపోయింది. వీరి స్నేహం గురించి గ్రామంలో గొప్పగా చెప్పుకుంటున్నారు. – అమూల్య, మౌనిక (ఫైల్)
తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు.... ప్రాణాపాయం నుంచి బయటపడిన :పీకా హేమలత...
మిర్చి కోతలు ముగించుకొని గ్రామంలోని అందరం ఉత్సాహంగా వస్తున్నాం. మధ్యలో ట్రాక్టర్ ట్రక్కు విద్యుత్ స్థంభానికి ఢీ కొనటంతో తీగపైనపడి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అందరూ అరుపులూ, కేకలు వేసుకుంటూ ట్రాక్టర్ ట్రక్కులో నుంచి ఎటువాళ్ళు అటు దూకే ప్రయత్నంలో ఉన్నారు. తేరుకునే లోపే దాదాపు పక్కన ఉన్న వాళ్ళూ, ముందు ఉన్న వాళ్ళూ ప్రాణాలు విడిచారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబిఏ చదువుతున్నాను. ఈ సంవత్సరం ఫీజు రీఎంబర్స్‌మెంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. పనికి వెళితే ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్లయింది.–పీకా హేమలత
శివ మృతితో ఆసరా కోల్పోయిన మూడు కుటుంబాలు..
గ్రామం మొత్తం మీద కాకుమాను రమాదేవి, ఆమె కుమారుడు శివ మృతి అందరినీ కలిసి వేసింది. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు ఒకే ఒక్క వారసుడు శివ(17). తండ్రికి తలలో గడ్డ వస్తే ఆపరేషన్ చేసినప్పుడు కంటి చూపు పోయింది. కంటి చూపు కోల్పోయిన డానియేల్ భార్య ర మాదేవి, కుమారుడు శివను తలుచుకుంటూ విలవిల్లాడుతున్నాడు. అతని ఓదార్చటం ఎవరితరం కావటం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో కరోనా మహమ్మారితో ఖాళీగా ఇంటి వద్ద తన కుమారుడు వాళ్ళ అమ్మతో కలిసి మిర్చి కోతలకు వెళ్ళాడంటూ తండ్రి డానియేలు కుమిలి కుమిలి రోదిస్తున్నాడు. తన కుటుంబంతో పాటు తన అన్న, తమ్ముడు కుటుంబానికి కూడా ఒక్కడే మగ సంతానం అని విలవిలలాడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా కందుకూరులోని ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడని ఇక తనకు దిక్కెవరు అంటూ కుమిలిపోతున్నాడు.
వద్దన్నా పనికి వెళ్లి మృత్యు ఒడికి..
మిర్చి కోతలకు తల్లి కాకుమాను వెంకాయమ్మతో కలిసి కుమార్తె మౌనిక(18)కూడా కూలీ పనికి వెళ్ళింది. అయితే ట్రాక్టర్, విద్యుత్ స్తంభం ప్రమాదంలో తల్లి వెంకాయమ్మ ప్రాణాపాయం నుంచి బయట పడింది. కుమార్తె తన కళ్ల ముందే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ కుటుంబంలో మౌనిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి ఎఫెఫ్రా గ్రామ పంచాయితీ సహాయకుడుగా(వీఆర్‌ఏ) పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు అబ్బాయి, అమ్మాయి. కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో ఎంతో ఉత్సాహంగా ఉండే మౌనికను చేతులారా పొట్టను పెట్టుకున్నానంటూ తల్లి వెంకాయమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తన కళ్ల ముందే బిడ్డను పోగొట్టుకున్నానంటూ విలపిస్తోంది. తన బిడ్డ మౌనిక చదువుకోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా నా బ్యాంకు అకౌంట్‌లో రూ.15 వేలు వేశాడంటూ గుర్తు చేసుకొని విలవిల్లాడింది. పనికి తీసుకెళ్లకుండా ఉన్నా ప్రభుత్వ సాయంతో బిడ్డ బాగా చదువుకొని తమ కుటుంబాలకు అండగా ఉండేదని బోరున విలపిస్తోంది. – మౌనిక ఫొటో చూపుతున్న తల్లిదండ్రులు
ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నర్సింగ్ చదువు...
కాకుమాను అమూల్య తల్లి అన్నమ్మ రోదిస్తూ:నర్సింగ్ డిప్లొమో చదువుతున్న తన కుమార్తె కాకుమాను అమూల్య మృత్యువాత పడటంతో అమూల్య కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి ఏబేలు గ్రామ పంచాయతీకి మంచినీరు వదిలేందుకు కూలీ పనికి వెళుతుంటాడు. ఏబేలు, అన్నమ్మ దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అమూల్య పదో తరగతి పాస్ కాగానే వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకుందని తల్లి అన్నమ్మ విలపించింది. డాక్టర్ చదువులకు ఆర్థిక స్తోమత సరిపోదని, నర్సు చదువు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని, అందుకే నర్సింగ్ కోర్సులో చేరిందని సెల్‌ఫోన్‌లో ఉన్న అమూల్య ఫోటో చూసి రోదించింది. నర్సింగ్ కోర్సులో చేరి మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ఈ బిడ్డ చదువుకు ప్రోత్సహించిందని, అయినా మా బిడ్డ కష్టాన్ని తినే ప్రాప్తం మాకు లేదని భోరున విలపించింది. – అమూల్య ఫొటో చూపుతూ రోదిస్తున్న తల్లి
చదువుల ఒడి నుంచి.. కూలికెళ్లి..
మాచవరం గ్రామస్తులంతా అక్షర పిపాసులే. అందుకే.. ఎప్పుడూ చదువులమ్మ ఒడిలో ఓలలాడుతుంటారు. అక్కడి విద్యార్థులకు సెలవులొస్తే బలాదూర్ తిరగటం ఇష్టముండదు. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. పదో.. పరకో సంపాదిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంటారు. లాక్‌డౌన్ వేళ చదువులకు సుదీర్ఘ విరామం రావటంతో.. ఇంటిపట్టున ఉండలేక గ్రామంలోని కూలీలతో కలిసి మిర్చి కోతలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై.. విద్యుదాఘాతంతో వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment