అశ్రునయనాల నడుమ..
Published Thu, Nov 21 2013 3:42 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
చెట్టున్నపాడు (భీమడోలు), న్యూస్‌లైన్ : భీమడోలు మండలం చెట్టున్నపాడులో చెరువు లీజు విషయమై రెండు వర్గాల మధ్య రాజుకున్న రావణకాష్టంలో బలైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో చెట్టున్నపాడులో విషాదం నెలకొంది. ఈ అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం దేవదాసు లలిత్, నేతల రంగరాజు, బొంతు జయరాజు మృతదేహాలు మంగళవారం రాత్రి చెట్టున్నపాడుకు తీసుకువచ్చారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువుల కడసారి చూపునకు ఉంచారు. తమ వారి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారి కన్నీరుమున్నీరు చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.
ఘనంగా అంత్యక్రియలు
గ్రామానికి సమీపంలో ముగ్గురి మృతదేహాలను క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు, జిల్లా ఎన్ జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్, తహసిల్దార్ బి.సోమశేఖర్, దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు.
నన్నెవరు చూస్తారు నాన్నా..
నువ్వు వెళ్లిపోయావు.. నన్నెవరు చూస్తారు నాన్నా.. అంటూ మృతుడు బొంతు జయరాజు కుమార్తె సౌజన్య కన్నీరుమున్నీరయ్యింది. ఆమె వికలాంగురాలు కావడంతో జయరాజు అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నాన్న ఇక లేడని తెలిసిన సౌజన్య జయరాజు మృతదేహం వద్ద మూగగా రోదించడం చూసి గ్రామస్తులు కంటనీరు పెట్టారు. శవ పేటిక వద్ద భార్య జయమణి, కుమారుడు క్రీస్తురాజు, కుమార్తె ఉషారాణి, మృతుని చెల్లెలు కుమారి రోధించారు.
పెద్ద దిక్కును కోల్పోయాం
చిన్న రైతుగా జీవిస్తున్న నేతల రంగరాజుకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనకున్న 17 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తున్నారు. కుమార్తె రత్నంకు వివాహం చేశాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని రంగరాజు భార్య ధనలక్ష్మి, కుమారుడు రవి వాపోయారు.
నాన్నా.. మాకు దిక్కెవ రు..
నాన్నా.. మాకు దిక్కెవరూ అంటూ దేవదాసు లలిత్ కుమారుడు శ్రీనివాసరావు గుండెలావిసేలా రోధించడం చూపరులను కలచి వేసింది. లలిత్ భార్య, కుమారులను ఓదార్చడం బంధువుల వల్ల కూడా కాలేదు. గ్రామంలో అందరికీ తలలో నాలుకగా ఉండే దేవదాసు లలిత్ మృతితో చెట్టున్నపాడు మూగబోయింది. చిన్నకారు రైతైన ఆయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. చెరువు లీజు పాత కమిటీ పెద్దగా ఉండి అనేక సమస్యలను పరిష్కరించడంతో దేవదాసును గ్రామస్తులు ఎంతో అభిమానించేవారు. అతడికి భార్య మరియమ్మ, ముగ్గురు కుమారులు రాజ్‌కుమార్, శ్రీనివాసరావు, బంగారు స్వాములున్నారు.
తహసిల్దార్‌ను అడ్డుకున్న మృతుల బంధువులు
భీమడోలు, న్యూస్‌లైన్ : చెట్టున్నపాడులో మృతదేహాలకు నివాళులర్పించేందుకు వచ్చిన తహసిల్దార్ బి.సోమశేఖర్‌ను బుధవారం మృతుల బంధువులు అడ్డుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉంచిన మృతదేహాలకు నివాళులర్పించేందుకు తహసిల్దార్ వెళ్లారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని, చస్తే చూడడానికి వచ్చారా అంటూ విరుచుకుపడ్డారు. గ్రామ పెద్దలు, జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తహసిల్దార్ వారిని ఓదార్చారు.
Advertisement
Advertisement