యువతే దేశానికి భవిత
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత యూనివర్సిటీలదే
మహిళా వర్సిటీ స్నాతకోత్సవంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్
యూనివర్సిటీక్యాంపస్ : ‘‘మన దేశ జనాభాలో 60 శాతం యువత ఉంది. వీరిని అన్ని విధాలా తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది’’ డీఆర్‌డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. అనంతరం ఆమె స్నాతకోపన్యాసం చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళ ప్రాత మారిందన్నారు. వంట, ఇంటి శుభ్రత, పిల్లల సంరక్షణకు ఇప్పటికి దాకా పరిమితమైన సంప్రదాయ మహిళ.. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోందన్నారు. సాంస్కృతిక, రాజకీయ, క్రీడా, కార్పొరేట్, తదితర ఏ రంగాలోనైనా సవాల్‌ను స్వీకరించడానికి మహిళలు సిద్ధంగా వున్నారని చెప్పారు. మహిళలను చక్కగా తీర్చిదిద్దితే ఏ రంగంలోనైనా రాణించగలరని ఆధునిక మహిళ నిరూపిస్తున్నదన్నారు. విద్యార్థులు పుస్తకాలు ఎక్కువగా చదివేలా ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల వారిలో సృజనాత్మకత, ఆలోచనా ధోరణి పెరుగుతుందన్నారు. పుస్తక పరిజ్ఞానానికి ప్రాక్టికల్ పరిజ్ఞానంగా మార్చుకోగలిగితే విజయాలు పొందవచ్చన్నారు. అధ్యాపకులు బోధనలో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవాలని కోరారు.
పోటీతత్వాన్ని విద్యార్థులు అందుకోవాలంటే వారికి మెరుగైన శిక్షణ అవసరమన్నారు. మన దేశంలో కీలకమైన పదవులను పోషిస్తున్న వారిలో మహిళల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అయితే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, పరిశోధనల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. లింగ వివక్ష, కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొంతమంది ఈ రంగంలోకి రావడం లేదన్నారు. విద్యార్థులు వైఫల్యాలు నుంచి పాఠాలు నేర్చుకుంటే విజయం సాధిస్తామని చెప్పారు. వీసీ రత్నకుమారి అధ్యక్షోపన్యాసం చేస్తూ విశ్వవిద్యాలయాల ప్రగతిని వివరించారు. విశ్వవిద్యాలయం అన్ని రంగాల్లో పురోగతిని సాధించిందన్నారు. కార్యక్రమానికి రిజిస్ట్రార్ విజయలక్ష్మి, డీన్లు మంజువాణి, రమణమ్మపాల్గొన్నారు.
1,196 మందికి డిగ్రీలు
స్నాతకోత్సవంలో 16 మందికి బంగారు పతకాలు, 10 మందికి బుక్‌ప్రైజ్‌లు, నలుగురికి నగదు బహుమతులు, 54 మందికి పీహెచ్‌డీలు, 8 మందికి ఎంఫిల్, 431 మందికి పీజీలు, 512 మందికి డిగ్రీలు, 191 మందికి దూరవిద్యా డిగ్రీలు ప్రదానం చేశారు. విద్యార్థినుల సందడి స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థినులు సందడి చేశారు. కోర్సు పూర్తయి వివిధ ప్రదేశాల్లో స్థిరపడి స్నాతకోత్సవానికి వచ్చిన న వారందరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. డిగ్రీలు అందుకుని ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు.