సొంతపార్టీలో ఒంటరి, రాజీనామాకు సిద్ధపడిన కిషన్‌రెడ్డి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీలో ఒంటరి అయ్యారు. ఒకవైపు సీనియర్ల నుంచి కొరవడిన మద్దతు, మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ నేతలతో సమన్వయలోపం ఆయనను ఒంటరిని చేశాయి. ఈ నేపథ్యంలో ఒకదశలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధపడ్డారు. ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి సమాచారం కూడా అందించారు. పార్టీ నిర్ణయం మేరకే తెలంగాణ ఉద్యమాన్ని నడిపానని, ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నారు.
తాను పాల్గొన్న అన్ని వేదికలపైనా సీమాంధ్ర సమస్యల్ని ప్రస్తావించినప్పటికీ తన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయడం, తనకు సమాధులు కట్టడం ఆయనకు ఏ మాత్రం మింగుడుపడకుండా ఉంది. సీమాంధ్ర సమస్యలపై సదస్సులు పెట్టకపోవడంలో తన తప్పేమీ కాదని, ఆ ప్రాంత నేతలు పెడితే తాను కాదనలేదని వాదిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని సీమాంధ్ర నేతలు చెప్పినందునే తాను వెనకాడానని, అయినా తననే ఆ ప్రాంత విలన్‌గా చిత్రీకరిస్తున్నారన్నారు. ఢిల్లీకి తమతో పాటు తెలంగాణ నేతల్ని పంపవద్దని సీమాంధ్రులు కోరితే వారందర్నీ ఆపానని, అయినా ముగ్గురు ఎమ్మెల్యేలు నాగం, యెండల, యెన్నం వెళితే తానేం చేయగలనని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ నేతల నుంచి కూడా ఆయనకు పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదు. సీమాంధ్ర నేతలు ఇటీవల తనపై ధ్వజమెత్తిన సమయంలో ప్రొఫెసర్ శేషగిరిరావు, వి.వి.రామారావు, యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు వంటి సీనియర్లు ఉన్నప్పటికీ తనకు అండగా నిలవకపోవడం కిషన్‌రెడ్డిని మరింత క్షోభకు గురిచేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో ఉండి కూడా సమావేశానికి రాకపోవడం కూడా పార్టీ అధ్యక్షుణ్ణి బాధించింది. ఇదిలా ఉంటే, కిషన్‌రెడ్డి పని తీరే ఆయన్ను పార్టీలో ఒంటరి చేసిందన్నది సీనియర్ల వాదనగా ఉంది. జిల్లా యాత్రలు మొదలు రథయాత్రల వరకు ఆయనే సొంతంగా నిర్వహించుకుంటున్నప్పుడు తాము చేయగలిగిందేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
5న తెలంగాణ ఉద్యమ కమిటీ భేటీ: సీమాంధ్ర ప్రాంత నేతలు తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తెలంగాణ బిల్లుకు మద్దతివ్వొద్దని అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు ఈనెల 5న హైదరాబాద్‌లో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ చర్చించనున్నారు. పార్టీ తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన తేదీలు కూడా ఈ భేటీలో ఖరారు చేస్తారని తెలిసింది.