పావగడలో విద్యార్థి హత్య
► సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శనలో అపశ్రుతి
► షో నిలిపివేత
పావగడ: థియేటర్‌లో కుర్చీ కోసం జరిగిన గొడవలో పవన్‌కల్యాణ్ అభిమాని హత్యకు గురయ్యాడు. స్థానిక అలంకార్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తాలూకా లోని బాలమ్మనహళ్లి గ్రామానికి చెందిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థి, పవన్ కళ్యాణ్ వీరాభిమాని రాకేశ్(20) తన స్నేహితులతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను చూడటానికి శుక్రవారం స్థానిక అలంకార్ థియేటర్ కు వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల మొదటి ఆటకు థియేటర్ లోకి వెళ్లాడు. అంతలో రవి అనే మరో పవన్ అభిమాని రాకేశ్ తో కుర్చీ కోసం గొడవ పడ్డారు. తేల్చుకుందామని ఒకరికొకరు థియేటర్ వెలుపలికి వచ్చారు.
అక్కడ పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. ఈ సందర్భంలో రవి నైల్ కట్టర్‌కు ఉండే చిన్న పాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. దీంతో ప్రధాన నరం తెగినట్లు చికిత్స అందించిన వైద్యులు భావించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి బంధవులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మృతుడి తల్లి శాంతిబాయి కొడుకు హత్యతో గుండెలవిసేలా రోదించింది. కొన్ని రోజుల క్రితమే భర్త సేవానాయక్ మృతి చెందడాన్ని మరువక ముందే కొడుకు హత్యకు గురి కావడం ఆమెను తీవ్రంగా కలచి వేసింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే సోమ్లానాయక్, మున్సిపల్ చైర్మన్ మానం వెంకటస్వామి పోలీస్ స్టేషన్‌కు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా సీఐ ఆనంద్‌కు సూచించారు.